హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని దళిత, గిరిజన సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘానికి, సీడీఎంఏ రాష్ట్ర కమిషనర్‌కు వినతిపత్రాలను అందజేశారు. అనంతరం గిరిజన సేవా సంఘం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు దేవసోత్ లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో రిజర్వేషన్ల ఖరారు, వార్డుల విభజనలో దళిత, గిరిజన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని, తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సీట్లు తగ్గాయని, రోస్టర్ పాయింట్ల అమలులో పారదర్శకత లోపించిందని ఆరోపించారు.
కార్పొరేషన్ పరిధిలోని వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా జరుగలేదని, దళిత, గిరిజన ఓటర్లు ఎకువగా ఉన్న ప్రాంతాలను ఉద్దేశపూర్వకంగా విడదీసి వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యలన్నింటినీ పరిషరించే వరకు, సమగ్రంగా రిజర్వేషన్లు ఖరారు చేసే వరకు కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత గిరిజన నాయకులు కాడ ఆంజనేయులు, కంచెమి లక్ష్మణ్, రమావత్ రవి రాథోడ్, రూడావత్ రమేశ్‌నాయక్, తోకల కృష్ణయ్య, జీ గంగాధర్, ఎల్ రమేశ్, మూడావత్ ప్రతాప్‌నాయక్, వీ కిషన్పవర్, శివనాయక్, కాశిపోగా ప్రసాద్, ధర్పల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.