కొందరు ఒక్కో కార్యం సాధించడానికే ఈ భూమిపై అవతరిస్తారేమో అనిపిస్తున్నది. గాంధీ మహాత్ముడు అవతరించకపోతే, మనకు అంత సులభంగా స్వాతంత్య్రం వచ్చేదా? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి ఒక్క తూటా కూడా పేలకుండా విముక్తి సాధ్యమయ్యేదా? అని భారతీయులే కాదు, ప్రపంచమంతా అనుకొని ఉంటారు. ఇందులో సత్యం కూడా ఉన్నది. ఆత్మ బలంతో కార్యసాధన అనే మహాత్ముడి దారి ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపించింది. అమెరికాలో కూడా ఇప్పటికీ కూడా మహాత్మాగాంధీ ప్రభావం ఉన్నది.
శాంతియుత ఉద్యమాల విషయం మరిచిపోయి, ఇక ఉద్యమాలు అంటే హింసాయుతంగా సాగేవే అని నమ్మేకాలం ఒక దశలో మన దేశంలో ఏర్పడింది. రాజ్యాంగ విధానాలపై కూడా కొందరు నమ్మకం కోల్పోతున్న దశ అది. సగటు రాజకీయ నాయకుల వ్యవహార సరళి మూలంగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి తరుణంలో కేసీఆర్ తన కార్యాచరణను మొదలు పెట్టారు. ఒక నవ్య రాజకీయాలు నడిపే మహా నాయకుడిగా కేసీఆర్ ప్రస్థానం సిద్దిపేటలో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడే మొదలైంది.
ఎమ్మెల్యేగా ప్రజల కన్నీళ్లు తుడవడం ఎలా అనేదే కేసీఆర్ నిరంతరం ఆలోచించారు. మిషన్ భగీరథ వంటి వినూత్న పథకాలకు ఆనాడే ఆయన అంకురార్పణ చేశారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన అనుసరించిన విధానాలకు సిద్దిపేటలోనే బీజం పడింది. ఆయన పార్టీ నాయకులకు తరచూ ఇదే చెబుతుంటారు. ప్రజల సమస్యలు తీర్చాలి తప్ప వేరే అడ్డదారులేవీ ఉండవంటారు. ఏదో ఒకసారి గెలువగానే ప్రజలను మరిచిపోకూడదని చెబుతారు. కేసీఆర్ నుంచి నేర్చుకోవలసిన మరొక గొప్ప విషయం..అత్యంత ప్రధానమైనది- పరిపాలకుడు ఏవిధంగా ఉండాలనేది.
కేసీఆర్కు ఈ విషయంలో స్పష్టత ఉండబట్టే, తెలంగాణ అతి పరిమిత కాలంలో అభివృద్ధి బాటలో అత్యంత వేగంగా పరుగులు పెట్టింది. తెలంగాణ అభివృద్ధి చెందిన తీరు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కేసీఆర్ను చాలామంది ఇతర పార్టీల నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం పైకి విమర్శిస్తుండవచ్చు. కానీ వారికి మనసులో తెలుసు. కేసీఆర్ అసాధారణ పరిపాలకుడని. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. వారికి కేసీఆర్ అంటే గిట్టదు. అనేకసార్లు బీజేపీ నేతలు కేసీఆర్ను విమర్శిస్తుంటారు.
కానీ పార్లమెంటులో నివేదికలు ప్రవేశపెట్టినప్పుడు, ప్రశ్నలకు సమాధానం మంత్రులు ఇచ్చినప్పుడు, అనివార్యంగా తెలంగాణ అభివృద్ధి కథనాన్ని ఏకరువు పెట్టక తప్పదు. వాస్తవాలు ఎవరూ దాచిపెట్టలేరు. గణాంకాలను ఎవరూ మార్చలేరు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సాగుతున్నప్పుడు, చాలామంది గిట్టనివారు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే నిలబడలేదని అబద్ధాలు ప్రచారం చేశారు. కానీ తెలంగాణ ధనిక రాష్ట్రమని, మనుగడ సాధిస్తుందని, అభివృద్ధి చెందుతుందని ప్రజలకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. అందుకే ప్రజలు ఆయనను నమ్మారు. తెలంగాణ ఉద్యమం సఫలమైంది. తొమ్మిదన్నరేండ్లు ప్రగతి బాటలో పయనించింది. ఇటీవల పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా తన సొంత నిధులపై ఆధారపడి తెలంగాణ ప్రగతి సాధిస్తుందని కేంద్రం అంగీకరించవలసి వచ్చింది. ఇదే కేసీఆర్ ఘనత.
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలను పరిశీలించి నా కేసీఆర్ ప్రభావం ఎంతగా ఉందో తెలుస్తున్నది. స్థానిక ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కడతారు. ఇవి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసే ఎన్నికలు కావు. అయినా బీఆర్ఎస్కు ప్రజా పునాది చెక్కుచెదరలేదని ఫలితాలను బట్టి తెలిసిపోయింది. అదీ కేసీఆర్ ప్రజలపై వేసిన ముద్ర. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేస్తామని కొందరు అనుకుంటుండవచ్చు. కానీ అది సాధ్యం కాదు. ఇందుకు కారణం కేసీఆర్ పరిపాలన విధానం. తాగు, సాగునీరు, రహదారులు నిరంతర విద్యుత్తు, సంక్షేమ పథకాలు ఇవన్నీ చెరిపేస్తే చెరగని వాస్తవాలు, చారిత్రక సత్యాలు.
ఇప్పటివరకు కేసీఆర్ సాధించిందేమిటనేది ప్రపంచానికి తెలుసు. కానీ ఆయన సాధించబోయేది ఇంకా తెలియదు. తెలంగాణ పరిపాలకుడిగా ఆయన మరోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయం. అయితే ఆయన తెలంగాణ దగ్గరే ఆగిపోరు. దేశ జాతీయ రాజకీయాలను ప్రక్షాళన చేసి, దేశానికి దిశానిర్దేశం చేసే కార్యాచరణలో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పాలనలో సాగిన నష్టాన్ని భర్తీ చేయడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆయన చేయవలసింది దేశ ప్రజలకు ఎంతో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఉద్యమాన్ని నడిపించినప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఆయన ఎదుర్కొన్నారనేది తెలిసిందే. ఆధిపత్య వర్గాలు, మీడియా మొదలుకొని అనేక శక్తులు అనేక దిక్కుల నుంచి పొంచి ఉండి దాడులు చేశాయి.
ఎన్నోసార్లు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అయినా ఆయన బెదరలేదు, వెనుకడుగు వేయలేదు. తెలంగాణను సాధించి, నిలబెట్టారు. వెనుకా ముందు, బలాబలాలన్నీ ఆలోచించుకునే ఆయన నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాన్ని, వ్యూహాత్మకంగా అమలు చేస్తారు. ఆయన వ్యూహాలు ప్రపంచంలో ఎవరికీ అంతుచిక్కవు. శత్రువు కూడా బొక్కబోర్లా పడ్డంక గానీ తెలుసుకోలేడు. కేసీఆర్ తన లక్ష్యాన్ని వదిలిపెట్టరు. ఆనాడు తెలంగాణ సమాజం ఒక గొప్ప నాయకుడి కోసం ఎదురు చూసినట్టుగానే, ఇప్పుడు దేశం ఒక గొప్ప నాయకుడి కోసం ఎదురు చూస్తున్నది. ఆ నాయకుడే కేసీఆర్. దేశ పరిస్థితులు కేసీఆర్ను కోరుతున్నాయి. కేసీఆర్ దేశ నాయకత్వం చేపట్టడమే కాదు, అన్ని వ్యవస్థలను చక్కదిద్ది కొత్త మార్గం పట్టిస్తారు. ఆరోజు వస్తుంది.
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
నీచ మానవులు ఆటంకాలు కలుగుతాయని ఏ పనీ మొదలుపెట్టరు. మధ్యములు ఆటంకాలు ఎదురు కాగానే వదిలేస్తారు. కానీ కేసీఆర్ వంటి ధీరులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, చేపట్టిన కార్యాన్ని సాధించి తీరుతారు. కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ప్రజలకు ప్రధానమైన విషయం. కానీ అది కేసీఆర్కు చిన్న విషయం. ఆయన అసలు అజెండా ఇంకా విస్తృ్తతమైనది. దేశ రాజకీయాల్లో కేసీఆర్ శాసించే కాలం ఎంతో దూరంలో లేదు. ఆరోజు కోసం మనమంతా ఆయనకు మద్దతుగా నిలబడదాం. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
శత్రువు కూడా బొక్కబోర్లా పడ్డంక గానీ తెలుసుకోలేడు. కేసీఆర్ తన లక్ష్యాన్ని వదిలిపెట్టరు. ఆనాడు తెలంగాణ సమాజం ఒక గొప్ప నాయకుడి కోసం ఎదురు చూసినట్టుగానే, ఇప్పుడు దేశం ఒక గొప్ప నాయకుడి కోసం ఎదురు చూస్తున్నది. ఆ నాయకుడే కేసీఆర్. దేశ పరిస్థితులు కేసీఆర్ను కోరుతున్నాయి. కేసీఆర్ దేశ నాయకత్వం చేపట్టడమే కాదు, అన్ని వ్యవస్థలను చక్కదిద్ది కొత్త మార్గం పట్టిస్తారు. ఆరోజు వస్తుంది.
– గోసుల శ్రీనివాస్ యాదవ్ 9849816817