హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగటంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో సాధారణం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. దీంతో పిల్లలు, వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువ అవుతుందని, వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉన్నదని తెలిపింది. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.2 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది. ఈనెల 16వరకు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేసినట్టు పేర్కొన్నది. నిర్మల్ జిల్లా పెంబి మండలం చింతగూడకు చెందిన వృద్ధుడు గంగారెడ్డి (60) చలి తీవ్రతకు బలయ్యాడు.