Congress | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల ఫలితాల టెన్షన్ పట్టుకున్నది. ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనని, ఆ ప్రభావం పార్టీపై, ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతాయోనని కీలక నేతలంతా ఆందోళనతో ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో అధికారంలో ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు సాధిస్తే అది పార్టీపై, ప్రభుత్వ పాలనా తీరుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు సంకేతంగా మారుతుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నట్టు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 10 నుంచి 12 సీట్లు గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అయితే ఏకంగా 13 సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. పైకి బీరాలు పలుకుతున్నప్పటికీ లోలోన మాత్రం అసలు ఫలితాలపై ఒకింత ఆందోళనగానే ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. తమకు 8 సీట్లు వచ్చినా పర్వాలేదని, అంతకన్నా తగ్గితే మాత్రం పార్టీకి, ప్రభుత్వాధినేతకు ఇబ్బందికర పరిస్థితేననే ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి 6 సీట్ల వరకే వస్తాయని, మరికొన్ని సర్వేలు అంతకన్నా తక్కువే వస్తాయని ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెల్లడించాయి. ఒకవేళ ఈ సర్వేల ఫలితాలే నిజమై.. తక్కువ సీట్లు వస్తే పార్టీ, ప్రభుత్వ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కాంగ్రెస్ నేతల్ని తొలచివేస్తున్నాయి. తక్కువ సీట్లు వస్తే పార్టీ నేతల్లో, ప్రజల్లో కూడా పార్టీపై నమ్మకం సడలిపోతుందని గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది. ఇదే జరిగితే భవిష్యత్తులో పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది.
లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్ నేతలకు పదవీ గండాన్ని తెచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ ఫలితాలు ఎవరి పదవులను ఊడగొడతయో, ఎవరికి పదవులు రాకుండా అడ్డుపడతాయోననే ఆందోళన ఆశావాహుల్లో వ్యక్తమవుతున్నది. ఈ ఎన్నికల్లో పనితీరు, ఫలితాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ఇప్పటికే ఆ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర నేతలకు తేల్చి చెప్పింది. దీంతో తమ పదవులకు ఢోకా లేదని పలువురు నేతలు అప్పట్లో గంతులేశారు. కానీ ఓటింగ్ నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో ఇప్పుడు వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ ఎన్నికలు తమ గండానికే వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ ఫలితంపై కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా, ఆయన అసెంబ్లీ నియోగజకవర్గం కొడంగల్ అందులో భాగంగా ఉండటమే కారణం. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వంశీచంద్‌రెడ్డి, బీ జేపీ నుంచి డీకే అరుణ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక్కడ పార్టీ ఓడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో ఆయన పట్టుదలతో పనిచేశారు. అయినప్పటికీ అక్కడ బీజేపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్నది. అదే జరిగి తే.. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఇదొక స్పీడ్ బ్రేకర్లా మారుతుందని భావిస్తున్నారు.
పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ అభ్యర్థులకు పీసీసీ అధినేత, సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎంపీ అభ్యర్థులు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జీలు, మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో సోమవారం ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారినే కౌంటింగ్ ఏజెంట్లుగా పంపాలని సూచించారు. సీనియర్ నాయకులను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతిరౌండ్ కౌంటింగ్‌లో జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరి దగ్గర 17సీ జాబితా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.