హనుమకొండ, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ దృష్టిలో బీసీలంటే రోబోలు అని, దశాబ్దాలుగా బీసీలపై జరుగుతున్న అణచివేతకు చరమగీతం పాడాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘బంద్ ఫర్ జస్టిస్’ విజయవంతం చేయాలని యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ముక్తకంఠంతో చేతులెత్తి నమసరిస్తూ విజ్ఞప్తి చేశారు. వరంగల్ వందల ఏళ్ల చరిత గల పోరాటాలగడ్డ అని… ఏ ఉద్యమం జరిగినా, ఇకడి నుంచి మొదలై తిరగబడుతుందని గుర్తుచేశారు. బంద్‌ను విజయవంతం చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలువాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌పై మసిపూసి మారేడుకాయలు చేస్తున్నదని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో బీసీలంతా ఏకమై ముందుండి పోరాడారని, అదే స్ఫూర్తితో బీసీ బంద్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. వ్యాపార, వాణిజ్య, అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తరతరాలుగా అణచివేయబడుతున్న జాతికి 42 శాతం రిజర్వేషన్ కోసం బీసి కులగణన చేయాలని అడుగుతున్నామని చెప్పారు. బీసీల ఆవేదన రేవంత్‌రెడ్డికి కనిపించడంలేదని, బడ్జెట్లో బీసీల వాటా అడగడం తప్పా అని ప్రశ్నించారు. లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు రెండు, 3 కోట్లు బిచ్చమేస్తున్నారని మండిపడ్డారు. తమ వాటా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డిక్లరేషన్ల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హేతుబద్ధమైన బీసీల డిమాండ్‌ను ఇతర వర్గాలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు.
బీసీల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి గురుకులాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. 42 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తే బీసీలు ఎదుగుతారనే కుట్రతో కాంగ్రెస్ మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో భ్రూణహత్యలకు పాల్పడి రిజర్వేషన్‌ను అడ్డుకున్నదని విమర్శించారు. బీసీలంతా ఐక్యంగా 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీని ఒప్పించి పార్లమెంటును స్తంభింపజేయాలని సూచించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బంద్ ఫర్ జస్టిస్‌కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్న బీసీలకు సముచితస్థానం కల్పించారని గుర్తచేశారు. బీసీ వ్యక్తి మధుసూదనాచారికి స్పీకర్ పదవి ఇచ్చారని, బీసీ కులాల వారికి అన్ని రంగాల్లో పదవులిచ్చి ఆదుకున్నారని చెప్పారు. హైకో ర్టు, సుప్రీంకోర్టు అంటూ కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని, తెలంగాణ ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలా వెళ్లిందో బీసీ బంద్ కూడా ఢిల్లీకి వినిపించాలని పిలుపునిచ్చారు. 60 శాతం ఉన్న బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపెల్లి జనార్దన్‌గౌడ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్ పాల్గొన్నారు.