హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సిట్ విచారణ పేరిట తెలంగాణ సాధకుడు కేసీఆర్‌ను వేధించడం అంటే తెలంగాణ జాతిని అవమానించడమేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్ తనకు తాను నిర్ణయం తీసుకుంటుందా? సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు వింటున్నదా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా సిట్ ఏర్పాటుచేసి, చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కేసీఆర్‌కు చట్టవిరుద్ధంగా నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
రాష్ట్రాన్ని నిర్బంధంలో నడిపిస్తున్నారని, అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలా పాలన సాగుతున్నదని మండిపడ్డారు. సిట్‌కు సహకరిస్తామని కేసీఆర్ చెప్పారని, అయినా, పోలీసులు ఉద్యమకారుల ఇండ్లకు వెళ్లి అరెస్టు పేరిట వేధించడం ఏమిటని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి ఒక మంచిపని చేసిందీ లేదని, కక్షపూరిత రాజకీయాలు చేయడంతోనే సరిపోతున్నదని మండిపడ్డారు. పాలన గాలికొదిలి బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ పాలన అంటే ప్రజా సంక్షేమమని, రేవంత్ పాలన అంటే ప్రజా నిర్బంధంగా మారిందని మండిపడ్డారు.