Congress | హైదరాబాద్, మార్చి 3(నమస్తే తెలంగాణ): పాత దూతను తప్పించి, నచ్చిన నేతకు బాధ్యతలు ఇప్పించుకుందామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహకర్త, ముఖ్య నేత వేసిన ఎత్తులు బెడిసికొట్టినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. కొత్త దూతను గుప్పిట్లో పెట్టుకొని రాష్ర్టాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుదామనుకున్న వారి ఆశలను అధిష్ఠానం తుంచివేసినట్టు చర్చ జరుగుతున్నది. అత్యాశకు పోతే మొదటికే మోసం వచ్చిందని, కొత్తదూత రూపంలో వచ్చిన నేత ఎప్పుడు ఏం ఉపద్రవం తీసుకొస్తుందో.. ఢిల్లీకేం నివేదికలు పంపిస్తుందోనని వలస కాంగ్రెస్ వర్గం నేతలు ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యనేత అవినీతికి, దారితప్పిన పాలనకు చెక్ పెట్టడానికే కొత్త దూత రాష్ర్టానికి వచ్చినట్టు రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. పాత దూతను బుట్టలో వేసుకున్న ఆ ముఖ్యనేత ఏడాదికాలంపాటు రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించినట్టు ఏఐసీసీ గుర్తించిందని సమాచారం. భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ, అక్రమ వసూళ్లు చేస్తున్నారని, పైగా ఈ నగదును ఢిల్లీ అధిష్ఠానానికే పంపిస్తున్నట్టు పలువురి వద్ద బహిరంగంగానే ప్రస్తావించినట్టు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అధిష్ఠానం విచారణ ఆదేశాలను అడ్డంపెట్టుకొని పాత దూత, ముఖ్య నేత పట్టు సాధించడానికి ప్రయత్నించినట్టు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. తానే సొంతంగా దుకాణం తెరిచి పైరవీలు మొదలు పెట్టినట్టు, కాంట్రాక్టు బిల్లులు మొదలు మంత్రివర్గ విస్తరణ ఆశావహుల వరకు అన్నీ తానై నడిపించినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ద్వారా సమగ్ర ఆధారాలు తెప్పించిన ఆ ముఖ్య నేత.. ఆ దూతపై నేరుగా ఏఐసీసీకే ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
రాష్ట్ర దూతగా ఆమెను మారిస్తే, తనకు అనుకూలమైన వారిని దూతగా రప్పించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తతో కలిసి ఆ ముఖ్యనేత స్కెచ్ వేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఏఐసీసీలోని ఒక కీలక నేత సహకారంతో మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతను ఢిల్లీ దూతగా ఇక్కడికి రప్పించాలని పథకం వేసినట్టు తెలిసింది. పథకంలో భాగంగానే సమగ్ర ఆధారాలతో పాత దూతపై ఇద్దరు ఎంపీలతో ఫిర్యాదులు చేయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో సమగ్రమైన వివరాలు పంపాలని కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పేరున్న మరో ఇద్దరు కీలక నేతలను పురమాయించి రాహుల్‌గాంధీ సమగ్ర నివేదక తెప్పించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యనేత అదుపు తప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారని, తాను దేశంలో అదానీపై పోరాడుతుంటే, అక్కడ ఆయన అదానీతో స్నేహపూర్వకంగా మెలుగుతున్నారని, పోయినేడు బంధువుల పెళ్లికని చెప్పి అదానీ కొడుకు పెండ్లికే వెళ్లారని, రాష్ట్రంలో గ్రూపు రాజకీయాలతో పార్టీ భ్రష్టు పట్టిందని, పాలన అదుపు తప్పిందనే నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అధిష్ఠానం పట్టించుకోకపోతే, రాష్ట్రంలో పార్టీ ప్రమాదంలో పడనున్నదని, పార్టీని నిండా ముంచి తన అనుచరులతో కలిసి బీజేపీలోకి జంప్ అయినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదని రాహుల్‌గాంధీ మనసు తెలిసిన ఆ కీలక నేత ఉప్పందించినట్టు తెలిసింది.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం తెలిసి కంగారుపడిన రాహుల్‌గాంధీ పాత దూతను తొలగిస్తూ.. తన ఆంతరంగిక బృందంలోని కీలక సభ్యురాలైన మీనాక్షి నటరాజన్‌కు బాధ్యతలు అప్పగించినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. నెల రోజులుగా ఢిల్లీ నుంచి రాష్ర్టాన్ని క్షుణ్నంగా పరిశీలించిన ఆమె కొన్ని మార్పులు అనివార్యం అని ఏఐసీసీకి సూచించినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆమె పాత దూతకు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఎమ్మెల్సీపై తొలివేటు వేసినట్టు ప్రచారం జరిగింది. తన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సదరు వ్యక్తికి టికెట్ ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టినట్టు తెలిసింది. కానీ ముఖ్యనేత ప్రోత్సాహంతోనే పాత దూత ఆయనకు టికెట్ ఇప్పించారని, ఇంతకాలం ఆమె అండ చూసుకొనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్టు కొత్త దూత నిర్ధారించినట్టు తెలిసింది. అట్లాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ఏమాత్రం సమన్వయంలేదని సీఎంకు పరిపాలన మీద పట్టులేదని ఆమె ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో క్షేత్రస్థాయి సమాచారం తీసుకుంటున్న ఆమె నివేదికను అధిష్ఠానానికి అందించనున్నట్టు తెలిసింది.