BJP | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో కొత్త తలనొప్పి మొదలైంది. ఆది నుంచి వలస నేతలనే నమ్ముకున్న బీజేపీకి ఇప్పుడు ‘ఘర్ వాపసీ’ టెన్షన్ పట్టుకున్నది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్ర బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్న నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ‘కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన నేతలు తిరిగి రండి.
అవసరమైతే నేనే ఒక మెట్టు కాదు పదిమెట్లు దిగుతా. నన్ను తిట్టినా ఫర్వాలేదు’ అంటూ ప్రకటనలు ఇస్తుండటం మరింత కలిసి వస్తున్నది. కాంగ్రెస్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ కాస్త ఎక్కువేనని అందరికీ తెలిసిందే. కానీ, బీజేపీలో పరిస్థితి పూర్తి భిన్నం. ప్రెస్‌మీట్ పెట్టాలన్నా బండి సంజయ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తున్నది అంతర్గత సమావేశాల్లో మొదటి నుంచీ బీజేపీలో ఉన్నవారు లేదా సంఘ్ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యం ఇస్తారు. మిగతా నేతలకు కనీస గౌరవం దక్కదు. ఇలాంటి స్థితిలో ఇమడలేక కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు మొదటి నుంచీ ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌కు చేరడం దాదాపు ఖాయమని సంకేతాలు అందుతున్నాయి. వాస్తవానికి మొదటి నుంచి రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ విధానాలు మింగుడుపడటం లేదు. పార్టీలో చేరిన కొత్త లో కాస్త గౌరవం ఇచ్చినా.. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదని అభిమాను లు ఎప్పటి నుంచో చెప్తున్నారు. రాష్ట్ర స్థాయి లో కీలక నేతగా ప్రాధాన్యం కల్పిస్తారని భావి స్తే.. నియోజకవర్గానికే పరిమితం చేయడం, పైగా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు తెలిసింది. మరోవైపు క్షేత్రస్థాయిలో బీజేపీకి పెద్ద గా క్యాడర్ లేకపోవడంతో రానురాను నియోజకవర్గంలో తన ఉనికి కనుమరుగు అవుతున్నదని సన్నిహితుల దగ్గర రాజగోపాల్‌రెడ్డి వాపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్‌కు వెళ్లడంపై కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు మొన్నటివరకు బీజేపీ వైపు మొగ్గుచూపినా, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పునరాలోచనలో పడినట్టు తెలిసింది.
బీజేపీ కేవలం డబ్బు కోసమే నేతలను వాడుకుంటున్నదనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వంటివారే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. సభల నిర్వహణ ఖర్చులన్నీ ‘బడా’ నేతల నుంచే వసూలు చేస్తారని, అవసరం తీరాక పక్కన పెట్టేస్తారని పేర్కొంటున్నారు. పార్టీలో కీలక బాధ్యతలన్నీ సంఘ్ లేదా ఏబీవీపీ నుంచి వచ్చినవారికే ఇస్తారని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ముఖ్య పదవులు దక్కవన్నది అందరికీ తెలిసిందే. బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి, ఈటల రాజేందర్‌కు అప్పగిస్తారని ఏడాదికిపైగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ పెద్దలు ఈవైపుగా ఆలోచిస్తున్నా.. రాష్ట్ర నేతలు, పార్టీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్‌చుగ్ మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో మేము ఎప్పటికీ కిందిస్థాయి నేతలుగానే మిగిలిపోవాలా? అనే అభద్రతాభావం ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో పెరిగిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేతలకు కర్ణాటక ఫలితాలు కొత్త ఆశలు రేకెత్తించాయి.