MLC Kavitha | ఖైరతాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 1: అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శిస్తే సహించేది లేదని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబును పూలే యునైటెడ్ ఫ్రంట్ హెచ్చరించింది. ఫ్రంట్ ప్రతినిధులు రాజారాం యాద వ్, తాడూరి శ్రీనివాస్, డాక్టర్ దత్తాత్రేయుడు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. పూలే సమాజానికి మా ర్గదర్శిగా నిలిచారని, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే స్త్రీవిద్యకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన సీఎం, మంత్రులు నోటి కొచ్చినట్టు మాట్లాడటంపై మండిపడ్డారు.
అసెంబ్లీలో తక్షణమే పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శి, ఎంబీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీ లింగం డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో చేస్తున్న ఉద్యమాన్ని హేళన చేస్తూ మాట్లాడిన మంత్రి పొన్నం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో లింగం మీడియాతో మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధి కోసం పాటుపడిన సంఘ సంస్కర్త పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని అడిగితే తప్పేంటని ప్రశ్నించారు.