హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ శాఖలో తాజా బదిలీల అంశం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఆ శాఖలో తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఒకటి తహసీల్దార్లను డీఆర్వో(డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్)లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం. మరొకటి అర్బన్ మండలాల్లో అదనపు తహసీల్దార్ నియామకం. రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు తీసుకొన్న ఈ రెండు నిర్ణయాలను తుగ్లక్ చర్యలుగా పేర్కొంటూ అదే శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బదిలీలపై రెవెన్యూ ఉద్యోగులు అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు.
ఇలాంటి ఉత్తర్వులను గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు. కింది స్థాయి అధికారులను బదిలీల పేరుతో పైస్థాయి అధికారుల తలపై కూర్చోబెట్టడంపై మరింత రగిలిపోతున్నారు. ఇలా ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు పనిభారం పేరుతో ఒకేచోట ఇద్దరు తహసీల్దార్లను కూర్చోబెట్టడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాలు సర్కార్ ఆదేశాల మేరకు జరుగుతున్నాయా? అధికారులే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రెవెన్యూ శాఖలో సాధారణంగా ఆర్డీవో కింద తహసీల్దార్లు పనిచేస్తారు. కానీ, పలు జిల్లాల్లో ఇకపై ఆర్డీవోలపై తహసీల్దార్లు పెత్తనం చెలాయించనున్నారు. జిల్లాలో కలెక్టర్ తర్వాత స్థానం డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ (డీఆర్వో)ది. ఆ తర్వాత స్థానం ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఉంటుంది. డీఆర్వో పోస్టుకు సాధారణంగా డిప్యూటీ కలెక్టర్ లేదా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమిస్తారు. కానీ, ఇందుకు విరుద్ధంగా తహసీల్దార్లను డీఆర్వోలుగా నియమిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులిచ్చింది. కింది స్థాయిలోఉన్న తహసీల్దార్‌ను అమాంతం ఉన్నతస్థానానికి బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ ఉత్తర్వులతో ఆర్డీవోలు తహసీల్దార్ కింద పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉత్తర్వుల్లో ఆరుగురు తహసీల్దార్లకు డీఆర్వోలుగా పోస్టింగ్ ఇచ్చింది. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నాగర్‌కర్నూల్, ములుగు, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో తహసీల్దార్లకు డీఆర్వోలుగా పోస్టింగ్ ఇస్తూ విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన డిప్యూటీ కలెక్టర్లకు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రమోషన్లు కల్పించకుండా ఆపదమొక్కుల కోసం తహసీల్దార్లకు డీఆర్వోలుగా పోస్టింగ్‌లు ఇవ్వడంపై రెవెన్యూ శాఖలో తీవ్ర దుమారం చెలరేగుతున్నది.
తహసీల్దార్లను డీఆర్వోలుగా వివాదాస్పద పోస్టింగ్‌లు ఇచ్చిన రెవెన్యూశాఖ.. 24 గంటలు తిరక్కముందే మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆర్డీవోల నెత్తిపై తహసీల్దార్లను కూర్చోబెట్టిన అదే శాఖ.. ఇప్పుడు ఒక తహసీల్దార్‌పై మరో తహసీల్దార్‌ను కూర్చోబెట్టింది. ఈ మేరకు అర్బన్ మండలాల్లో తహసీల్దార్‌కు తోడుగా అదనపు తహసీల్దార్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత 19 అర్బన్ మండలాల్లో అదనపు తహసీల్దార్లను నియమించింది. జనాభా పెరుగుదల, తహసీల్దార్లపై పనిభారాన్ని తగ్గించడానికి వీలుగా అదనపు తహసీల్దార్‌ను నియమిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ఆ ఉత్తర్వులను తహసీల్దార్లతోపాటు ఇతర రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదేం నిర్ణయమంటూ మండిపడుతున్నారు. ఒకరిపై ఒకరిని పెట్టడం, విధుల్లో కోత పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా వరుసగా రెవెన్యూశాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవి కచ్చితంగా తుగ్లక్ నిర్ణయాలేనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, పోస్టుల క్యాడర్‌ను పట్టించుకోకుండా, మనోభావాలను లెక్కచేయకుండా రెవెన్యూశాఖ తీసుకొన్న ఈ నిర్ణయాలపై మండిపడుతున్నారు. వెంటనే ఆయా ఉత్తర్వులను సమీక్షించాలని ఉద్యోగవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.