హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గత పదేండ్లలో దేశంలో 94 వేల సర్కార్ స్కూళ్లు మాతబడ్డాయి. రోజుకు సగటున 25 ప్రభుత్వ బడులు క్లోజ్ అయ్యాయి. ఆందోళన కలిగించే ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. ‘పాఠశాల విద్యా వ్యవస్థ – కాలానుగుణ విశ్లేషణ.. నాణ్యత మెరుగుదలకు విధాన ప్రణాళిక’ పేరుతో నీతి ఆయోగ్ ఇటీవల నివేదికను విడుదల చేసింది. స్కూళ్ల సంఖ్యతోపాటు ఎన్రోల్మెంట్ కూడా తగ్గుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది.
2014-15లో దేశవ్యాప్తంగా 11.07 లక్షల(73 శాతం) సర్కార్ స్కూళ్లు ఉండగా, 2024-25కు వచ్చేసరికి ఈ సంఖ్య 10.13 లక్షలకు (68.9శాతం) పడిపోయింది. ఎయిడెడ్ స్కూళ్లు 83 వేల నుంచి 79 వేలకు పడిపోయాయి. ప్రైవేట్ స్కూళ్లు మాత్రం 2.88 లక్షల నుంచి 3.39 లక్షలకు పెరిగాయి. అంటే 90 వేల సర్కార్ స్కూళ్లు మూతపడితే 51వేల ప్రైవేట్ స్కూళ్లు పెరిగాయి. పాఠశాల విలీన ప్రక్రియలో యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముందున్నాయి. ఈ రెండు రాష్ర్టాల్లోనే ఏకంగా 40 వేల బడులు విలీనం అయినట్టు నివేదిక ప్రకటించింది.
జాతీయంగా ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గినట్టు నివేదిక పేర్కొన్నది. 2014 -15లో 26.95 కోట్ల మంది విద్యార్థులు నమోదైతే.. 2024-25లో ఈ సంఖ్య 24.69 కోట్లకు పడిపోయింది. అంటే పదేండ్లలో 2.26 కోట్ల విద్యార్థుల నమోదు సర్కార్ బడుల్లో తగ్గింది. ఉన్నత స్థాయిల్లో డ్రాపౌట్ రేట్ కూడా ఆందోళన కలిగిస్తున్నది. ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్ రేట్ 0.3 శాతముంటే.. ప్రాథమికోన్నతలో 3.5 శాతంగా ఉన్నది. అదే సెకండరీ స్థాయిలో 11.5 శాతానికి పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. తొమ్మిదో తరగతి విద్యార్థుల్లో చాలామంది బీజగణితం, జ్యామితి, శాతాలు, భిన్నాలు, నిష్పత్తుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
