వేములవాడ, నవంబర్ 10: బీసీలను ముఖ్యమంత్రి చేసే విధానం ఇదేనా? అని బీజేపీ తీరును ఆ పార్టీ నాయకురాలు తుల ఉమ ఎండగట్టారు. బలహీనవర్గాలకు చేయూతనందిస్తానని చెప్పడం కాదని, చేతల ద్వారా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. వేములవాడ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించిన అధిష్ఠానం చివరి క్షణంలో చెన్నమనేని వికాస్‌రావుకు బీఫారం అందజేసింది. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి, నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కంటతడిపెట్టారు. బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం విప్లవోద్యమంలో పని చేయడం, తెలంగాణ ఉద్యమంలో పని చేయడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. బీసీ బిడ్డ అయిన తనకు వేములవాడ టికెట్‌ను ప్రకటించిన బీజేపీ తనకు ఎలాంటి సమాచారం లేకుండానే మరొకరికి బీఫారం అందజేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బానిసత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం కొట్లాడానని, విప్లవోద్యమంలో హత్యలకు పాల్పడినట్టు తనపై ఆరోపణలు చేశారని, వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తున్నట్టు చెప్పుకుంటున్న బీజేపీ.. ఇప్పుడు కేవలం వ్యక్తుల కోసమే పని చేస్తున్నదని మండిపడ్డారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.