POW Sandhya | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తేతెలంగాణ): వికారాబాద్ జిల్లాలోని లగచర్ల రైతులది ధర్మాగ్రహంతో కూడిన తిరుగుబాటు అని పీవోడబ్ల్యూ రాష్ట్ర నేత సంధ్య ఒక ప్రకటనలో తెలిపారు. అసలు సమస్యను గుర్తించి, దానిని పరిష్కరించకుండా దాడి చేశారనే కోణంలోనే రైతులపై కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఈ ఘ టన అవాంఛనీయమైనద ని, బాధాకరమైనదని తెలిపారు. రైతుల ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉన్నదని సూచించారు. రైతుల ఆగ్రహాన్ని చల్లార్చకుండా వారిని కేసుల ద్వారా అణగదొక్కాలని అనుకోవడం సరికాదని హితవు పలికారు.
రైతులు తమ భూములను కోల్పోతున్నామనే ఆక్రోశంతో, ఆగ్రహంతోనే తిరుగుబాటు చేస్తారని, రాజకీయ ప్రయోజనాలను వారు పట్టించుకోరని తెలిపారు. అధికారులు పరిష్కారం చూపలేకపోతున్నారనే బాధతోనే కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులపై రైతులు ధర్మాగ్రహం ప్రదర్శించారని ఆమె తెలిపారు. అణిచివేతలు, అక్రమ కేసులతో సమస్యలు పరిష్కారం కావని, వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి మార్గం చూపితేనే అసలు సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.
ఫార్మా సిటీని వ్యతిరే కిస్తున్న లంబాడ రైతుల అరెస్టును తీవ్రంగా ఖండి స్తున్నా. పోలీసులు అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలి. వారిపై కేసులను రద్దు చేయాలి. లేకుంటే రాష్ట్రంలోని 50 లక్షల బంజారా సమాజాన్ని మేల్కొలుపుతాం. రైతుల పక్షాన నిలబడి కొట్లాడుతాం.
– ఓయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ నెహ్రూ నాయక్