హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ)/గోదావరిఖని: సింగరేణి కార్మికులకు ప్రకటించిన లాభాల వాటాపై కార్మిక వర్గాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. కార్మికులకు ఈ సారి ప్రకటించిన వాటా బూటకమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రికార్డు బొగ్గు ఉత్పత్తి సాధించడంతో రూ.4,071 కోట్ల నికర లాభాలు వచ్చినట్టు యాజమాన్యం పేర్కొన్నది. ఇందులో నుంచి సింగరేణి భవిష్యత్తు ప్రణాళిక కోసం 2,289 కోట్లను పక్కన బెట్టినట్టు సెలవిచ్చిందని, మిగతా రూ.2,412 కోట్ల లాభాల నుంచే కార్మికులకు 33 శాతం కింద రూ.796 కోట్లను బోనస్‌గా అందజేస్తామని ప్రకటించడంతో కార్మిక వర్గాల్లో నిరసన వ్యక్తమవుతున్నది.
సంస్థ యాజమాన్యం పక్కన పెట్టిన 2,289 కోట్లకు 33 శాతం వాటాలు ఎగ్గొడుతున్నదని నేతలు ఆరోపిస్తున్నారు. గత పదేండ్లలో నికర లాభాల్లో కార్మికుల బోనస్‌ను పరిశీలిస్తే ఈసారే అతి తక్కువ బోనస్ వచ్చిందని వారు తేల్చి చెప్తున్నారు. 2022-23లో 32 శాతం బోనస్ అంటే రూ.2,222 కోట్లకు రూ.711 కోట్లను సంస్థ ఉద్యోగులకు బోనస్‌గా అందజేసింది. ఇప్పుడు 50 శాతం లాభాలను పక్కనబెట్టి, మిగతా 50 శాతానికే బోనస్‌ను ప్రకటించింది. దీంతో కార్మికులకు తీవ్రంగా నష్టం జరిగింది.
తాజాగా ప్రకటించింది 33 శాతం కాదని, 16.93 శాతమే అవుతుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. లాభాలేమో రూ.4,701 కోట్లు చూపించి, కేవలం రూ.2,412 కోట్లలో 33 శాతం బోనస్‌ను ప్రకటించారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మిగతా రూ.2,289 కోట్లకు బోనస్‌ను ఎగ్గొట్టారని ఆరోపిస్తున్నాయి. గతంలో ఇలా ఎప్పుడు జరగలేదని, ఇదేం బోనస్ అని ప్రశ్నిస్తున్నాయి. వాస్తవంగా 4,701 కోట్ల లాభాలకు 33 శాతం బోనస్ ప్రకటించి ఉంటే బోనస్‌గా దాదాపు 1,400 కోట్లకు పైగా కార్మికులకు దక్కేదని, ఒక్కో కార్మికుడికి రెండు లక్షలకు పైగా బోనస్ రూపంలో వచ్చేదంటున్నాయి. అంటే 50 శాతం గండికొట్టి గొప్పగా ప్రచారం చేసుకోవడంపై ఆయా సంఘాలు గుర్రుగా ఉన్నాయి.
సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,701 కోట్ల వాస్తవ లాభాలు ఆర్జించినా, రూ.2,412 కోట్లకు పరిమితం చేయడం కార్మికులను మోసం చేయడమేనని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. లాభాల నుంచి సింగరేణి అభివృద్ధి పేరుతో పక్కనపెట్టడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఆల్‌టైం రికార్డు ఉత్పత్తిని సాధించినా గతం కంటే ఒక్కో కార్మికుడికి అదనంగా ఇచ్చేది రూ.20 వేలేనా? అని తెలిపారు. ఈ అంశాలపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ప్రకటించారు. కార్మికులకు ప్రకటించిన వాటా బూటకమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.