హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి వాటాలను మీరే తేల్చుకోండంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులెత్తేసింది. ఇరు రాష్ర్టాల సీఈలతో కమిటీ వేసి చేతులు దులుపుకొన్నది. మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. రెండు ఉమ్మడి రిజర్వాయర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు కేవలం 78 టీఎంసీలు కాగా, ఇరురాష్ర్టాలు కలిపి దాదాపు 149 టీఎంసీలు కావాలని ఇండెంట్ పెట్టాయి. ఈ నేపథ్యంలో నీటి వాటాల సంగతి రాష్ర్టాలే తేల్చుకోవాలని బోర్డు సూచించింది. ఈ నీటి సంవత్సరంలో ఏపీ సర్కారు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి దాదాపు 639 టీఎంసీలను మళ్లించుకుపోయిందని తెలంగాణ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సెక్రటరీల స్థాయిలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్‌జైన్ జలసౌధలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ హాజరు కాలేదు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్, ఇతర అధికారులు, ఏపీ తరఫున ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఏపీ ఇప్పటికే తన వాటాకు కేటాయించిన 666 టీఎంసీల్లో 639 టీఎంసీలను వాడుకున్నదని తెలంగాణ అధికారులు వివరించారు. 66:34 నిష్పత్తిలో వాడుకోవాల్సి ఉన్నా 75:25 నిష్పత్తిలో ఖాళీ చేసిందని వివరించారు. ఏపీ కోటాలో మిగిలింది 27 టీఎంసీలేనని, ఇప్పుడు 34 టీఎంసీలను డిమాండ్ చేయడమేంటని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడున్న నీటిని తెలంగాణకే ఇవ్వాలని కోరారు. శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్ నుంచీ ఏపీ నీటిని తరలించకుండా నియంత్రించాలని బోర్డును డిమాండ్ చేశారు. ఏపీ అధికారులు మాట్లాడుతూ.. ఏపీ ఆయకట్టుకు ప్రస్తుతం నీటి అవసరం ఉన్నదని తెలిపారు. ఫిబ్రవరి అవసరాలకు 16, మార్చికి 18 టీఎంసీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అయితే తెలంగాణలోనూ ఆయకట్టు ఉన్నదని, తాము ఇంకా కోటా ప్రకారం రావాల్సిన జలాలు 116 టీఎంసీలు ఉన్నాయని తెలంగాణ అధికారులు వెల్లడించారు. తెలంగాణ అవసరాలూ తీర్చాల్సిన అవసరం ఉన్నదని తేల్చి చెప్పారు.
రిజర్వాయర్లలో డిమాండ్ మేరకు నీటినిల్వలు లేకపోవడం, ఇరు రాష్ర్టాలు పట్టువీడకపోవడంతో బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ చేతులెత్తేశారు. నీటివాటాలను ఇరురాష్ర్టాలే తేల్చుకోవాలని సూచిస్తూ నల్లగొండ సీఈ, ఏపీ సీఈతో కమిటీ ఏర్పాటుచేశారు. ఇద్దరు సీఈలు మంగళవారం సమావేశమై, నీటి వినియోగంపై చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. వారిద్దరు సమావేశమైన తర్వాత 26న మరోసారి బోర్డు మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం తెలంగాణ ఈఎన్సీ, ఏపీ ఈఎన్సీ కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.