హైదరాబాద్ : గోదావరి జలాల విషయంలో తెలంగాణ ద్రోహం జరుగుతున్నదని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు మరణశాసనం రాస్తున్నదని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరుగుతున్న జలద్రోహాన్ని వెల్లడించేందుకు తాను ప్రెస్‌మీట్ పెట్టానని చెప్పారు.
హరీష్‌రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘ఇదొక ముఖ్యమైన మీడియా సమావేశం. అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి కల్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. కాళోజీగారు ముందే ఊహించి చెప్పినట్లు.. ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్న ద్రోహం ఇది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరుగుతున్న ఈ జల ద్రోహాన్ని వివరించేందుకే ఈ ప్రెస్ మీట్. తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది’ అన్నారు.
‘గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో BRS పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ సర్కారును అప్రమత్తం చేస్తూనే వస్తుంది. గతంలో అనేకసార్లు ప్రెస్మీట్లు పెట్టినం. వాస్తవాలు బయట పెట్టినం. అయినా ప్రభుత్వం తరఫున నామమాత్రంగా బ్యాక్ డేట్ వేసి, లెటర్లు మీడియాకు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నం. అది బనకచర్ల అయినా, నల్లమలసాగర్ అయినా మారింది పేరు మాత్రమే. కానీ, ఏపీ జలదోపిడి ఆగలేదు. జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే పొడిచేది రేవంత్ రెడ్డి’ అని హరీష్‌రావు మండిపడ్డారు.