Sangareddy | సంగారెడ్డి, జనవరి 7(నమస్తే తెలంగాణ) : వీధి కుక్కల బెడద తొలగించుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు 32 కుక్కల మూతులకు, కాళ్లకు బైడింగ్ వైర్లు చుట్టి సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఓ బ్రిడ్జి కింద పారవేశారు. ఈ ఘటనలో 21 కుక్కలు మృతి చెందగా 11 కుక్కలను సిటిజన్ ఫర్ యానిమల్ సంస్థ రక్షించింది.
ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం .. ఎద్దుమైలారం సమీపంలోని రోడ్డు కమ్ బ్రిడ్జి కింద 32 కుక్కలను గుర్తు తెలియనివ్యక్తులు పడేశారు. 21 కుక్కలు మృతి చెందాయి. బతికి ఉన్న కుక్కలు అరుస్తుండటంతో బ్రిడ్జి పైనుంచి వెళ్లిన వాహనదారుల్లో ఒకరు గుర్తించి సిటిజన్స్ ఫర్ యానిమిల్స్ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 కుక్కలను ఆ సంస్థ ప్రతినిధులు కాపాడి నాగోల్‌లోని షెల్టర్‌కు తరలించారు. పశుసంవర్ధక శాఖ వైద్యులు సోమవారం పోలీసుల సమక్షంలో కుక్కలకు పోస్టుమార్టం చేశారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు.