హైదరాబాద్, జూలై6 (నమస్తే తెలంగాణ): ఈ నెలాఖరు నాటికి నివేదికను ఇచ్చేందుకు కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఆ కమిషన్ గత ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయాలపై లోతుగా పరిశీలిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాటి ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషించేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతీ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదంతోనే తీసుకున్నామని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిషన్‌కు నివేదించారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన పత్రాలను, ఆ క్యాబినెట్ మీటింగ్ మినిట్స్‌ను అందివ్వాలని ఘోష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ మేరకు ప్రభుత్వం గత నెల 30లోపే క్యాబినెట్ ఫైళ్లను సమర్పించింది.