హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తప్పుడు సమాధానాలతో కూడిన తుది కీ ఆధారంగా నిర్వహించే గ్రూప్-1మెయిన్స్ పరీక్ష ప్రభావం ఎంపికపై ఉంటుందంటూ హైకోర్టులో పలువురు గ్రూప్-1 అభ్యర్థులు అప్పీళ్లను దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఈ నెల 15న ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు. గ్రూప్-1 ప్రిలిమినరీ కీలో తప్పులున్నాయని పలు ఆధారాలను సమర్పించినప్పటికీ సింగిల్ జడ్జి పట్టించుకోలేదని తెలిపారు.
ఈ అప్పీళ్లపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉన్నది. ‘కేసులోని పూర్వాపరాలను, వాస్తవాలను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. టీజీపీఎస్సీ ప్రకటించిన తుది కీలో తప్పులున్నాయని ఆధారాలు చూపినా వాటి జోలికి వెళ్లలేదు. దీనిపై మా వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రశ్నల్లో ఏ రకంగా తప్పులున్నాయో చెప్పినా పరిశీలించలేదు. ప్రశ్నకు ఐచ్ఛిక సమాధానాల్లో సరైనది లేనపుడు ఆ ప్రశ్నను తప్పుగా పరిగణించాలి. కానీ ఆ విధంగా జరుగలేదు.
మెలికలతో కూడిన ప్రశ్నలు ఉండాలంటూ సర్వీస్ కమిషన్ చేసిన వాదనను సింగిల్ జడ్జి ఆమోదించడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలి. 41, 119వ ప్రశ్నలను పరిశీలిస్తే.. తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేవి. ఈ రెండు ప్రశ్నలను తొలగించడం వల్ల మెరిట్ జాబితాపై ప్రభావం పడుతుంది. ఇలాంటి కీ ద్వారా మెయిన్స్‌కు అభ్యర్థుల జాబితా రూపొందించడం చట్ట వ్యతిరేకం. ప్రాథమిక పరీక్ష ఒకటే ఎంపికకు ప్రామాణికం కాబోదు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని సింగిల్ జడ్జి పేరొనడం చెల్లదు. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాల్సిందే’ అని పిటిషనర్లు తమ అప్పీళ్లల్లో కోరారు.