JL Recruitment | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. 8న సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,392 లెక్చరర్ పోస్టుల భర్తీకి 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కేసీఆర్ హయాంలోనే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రాత పరీక్షలను సైతం నిర్వహించారు. ఇటీవలే ఫలితాలను విడుదల చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను పూర్తిచేశారు.
తాజాగా తుది ఫలితాలు ప్రకటించి, ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు అందజేయాల్సి ఉంది. కాగా లెక్చరర్ పోస్టుల భర్తీకి గతంలో ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీంతో కేసీఆర్ సర్కారు వివక్షకు, పక్షపాతానికి అవకాశం లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ఇంటర్వ్యూలను రద్దు చేసింది. దీంతో తాజాగా నియామకమయ్యే లెక్చరర్లు ఇంటర్వ్యూల్లేకుండా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకోనున్నారు.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): అఖిల భారత సర్వీసు, స్టేట్ సర్వీస్‌లోని ఉన్నతాధికారులకు నిర్వహించే అర్ధవార్షిక, భాషాపరీక్షలను ఈ నెల 27 నుంచి 30 వరకు నిర్వహిస్తామని టీజీఎస్పీ తెలిపింది.