జగిత్యాల అర్బన్, డిసెంబర్ 27 : జగిత్యాల జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. శుక్రవారం విధులకు హాజరైన ఆయన ఉదయం 4 గంటల తర్వాత తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందారు. శ్రీనివాస్ మృతిపట్ల వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.
అంకితభావంతో పనిచేస్తూ, బాధ్యతాయుత అధికారిగా మంచి గుర్తింపు పొందిన శ్రీనివాస్ మరణం వైద్య శాఖకు తీరని లోటు అని వారు పేరొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులర్పించి,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.