హిల్ట్ పాలసీలో భూముల కన్వర్షన్ పారిశ్రామికవేత్తల ఐచ్ఛికమని పరిశ్రమలశాఖ మంత్రి ఇటీవల ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో ఎక్కడా తప్పనిసరిగా భూములు కన్వర్షన్ చేసుకోవాలనే ప్రస్తావన లేకున్నా, ఉత్తర్వులు వెలువడిన 24 గంటల్లోనే పీసీబీ నుంచి పరిశ్రమలన్నింటికీ గంపగుత్తగా నోటీసులు జారీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
మరోవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలు హిల్ట్ పాలసీకి దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరడం విశేషం. ఒకవేళ పరిశ్రమల తరలింపు ఐచ్ఛికమైతే.. పీసీబీ నోటీసులు జారీచేయడంలో ఆంతర్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని పరిశ్రమవర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఒకవేళ హిల్ట్ కాలుష్య పరిశ్రమల తరలింపు కోసమే తెచ్చినట్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్తున్నప్పటికీ, ఔటర్ లోపల ఉన్న అన్ని పరిశ్రమలకు కూడా పీసీబీ నోటీసులు జారీచేయడం విమర్శలకు తావిస్తున్నది.