హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమలకు అవసరమైన అనుమతుల జారీ, భూముల కేటాయింపు వంటి కీలక విధులు నిర్వర్తించాల్సిన టీజీఐఐసీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ రక్షణ శాఖ ఉద్యోగిని సీఈవోగా నియమించిన ప్రభుత్వం, పూర్తిగా సీఎంవో నుంచే పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్టు అధికారవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతకు చెందిన ఇద్దరు అనుచరులు నిత్యం చైర్మన్ కార్యాలయం వద్ద తిష్టవేస్తూ వ్యవహారాలు చక్కబెడుతుంటే, అధికార యంత్రాంగం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయిందనే విమర్శలొస్తున్నాయి. సాధారణంగా కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలంటే టీజీ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ ద్వారానే అన్నిరకాల అనుమతులు, భూముల కేటాయింపు వంటి ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా చైర్మన్ నియామకం తరువాత అధికార యంత్రాంగం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆన్లైన్ విధానం కేవలం నామమాత్రంగా మారిపోయింది. నేతల అనుచరులకు లంచాలు ముట్టజెప్తే తప్ప, అనుమతులు మంజూరయ్యే అవకాశం లేకుండా పోయిందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. సంగారెడ్డికి చెందిన ఒక కాంగ్రెస్ నేతకు సంబంధించిన ఇద్దరు అనుచరులు టీజీఐఐసీలో తమ హవా కొనసాగిస్తున్నారు. నిత్యం చైర్మన్ కార్యాలయం వద్దే తిష్టవేసి దరఖాస్తుదారులతో సమావేశాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. వారికి ఆమ్యామ్యాలు ముట్టిన తరువాత సీఎంవో నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తుందని, ఆ తరువాతే ఎండీ, సీఈవో ఫైలును ముందుకు కదిలిస్తారని టీజీఐఐసీలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఇటీవల ఒక ఎన్నారై సుమారు రూ.50 కోట్ల పెట్టుబడితో రెండెకరాల్లో చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు చేశాడు. రెండు నెలలు దాటినా అయనకు టీజీఐఐసీ నుంచి స్పందన రాకపోవడంతో ఇటీవలే మన దేశానికి వచ్చిన సదరు దరఖాస్తుదారుడు టీజీఐఐసీ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. అక్కడ ఎవ్వరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఓ ఉన్నతాధికారిని కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించారు. అంతా విన్న తరువాత సదరు అధికారి చావుకబురు చల్లగా చెప్పినట్టు.. సచివాలయం నుంచి గ్రీన్‌సిగ్నల్ ఉన్న దరఖాస్తులనే ఇక్కడ పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. తాను ఎవరిని కలవాలో చెప్తే వెళ్తానని సదరు దరఖాస్తుదారుడు అభ్యర్థించగా.. ‘అదంతా మాకు తెలియదు. మీరే బయట తెలుసుకోండి’ అని పంపించివేశారు సదరు అధికారి. ఆ తరువాత చైర్మన్ కార్యాలయం వద్ద తిష్టవేస్తున్న వ్యక్తుల గురించి తెలుసుకొని మరుసటిరోజు వెళ్లి వారిని కలిశాడు సదరు దరఖాస్తుదారుడు. అనంతరం ఆయనకు పరిశ్రమ అనుమతులతోపాటు భూ కేటాయింపు చేశారు.
ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి టీజీఐఐసీలో నిత్యం ఇదే తంతు కొనసాగుతున్నది. ఒక కాంగ్రెస్ నేత సీఎంవోలో తనకున్న పలుకుబడితో ఫైళ్లకు అనుమతులు జారీచేయిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. అధికారులు సైతం మారుమాట్లాడకుండా సీఎంవో నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన దరఖాస్తులకే అనుమతులిస్తూ, తమ పోస్టులను కాపాడుకునే పనిలో ఉన్నారని పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి. అధికారులు సొంతంగా ఒక్క ఫైలుని కూడా కదిలించే పరిస్థితి లేదని, ఒకవేళ వారు ఆ సాహసం చేస్తే వెంటనే వారి కుర్చీలు కదిలిపోతాయని వ్యాఖ్యానిస్తున్నారు. పరిశ్రమల శాఖలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని అధికారవర్గాలు లోలోపల కుమిలిపోతున్నాయి. ఈ తరహా పరిస్థితులు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న బడా పెట్టుబడిదారులు ఎలాగైనా ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించుకుంటారని, చిన్నతరహా పెట్టుబడిదారులకే బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. అనుమతులు పొందేందుకే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, పరిశ్రమ ఏర్పాటయ్యాక మునుముందు ఇంకా ఎన్నివిధాల ఇబ్బందులు ఉంటాయోనని పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. గత రెండేండ్లలో పరిశ్రమల శాఖలో పరిస్థితులు మరీ అధ్వానంగా మారాయని ఆ శాఖకు చెందిన ఓ రిటైర్డ్ అధికారి పేర్కొన్నారు. తాము ఎన్నో ఏండ్లుగా ఈ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసినా.. ఈ పరిస్థితులు చూడలేదని సదరు అధికారి చెప్పారు.