హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ చర్యలు చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని, చట్టానికి అతీతంగా చర్యలు తీసుకుంటామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. హైడ్రాను ఏర్పాటు చేస్తూ జారీచేసిన జీవోలో పేరొన్న మార్గదర్శకాలకు అనుగుణంగానే కమిషన్ చర్యలు ఉండాలని స్పష్టంచేసింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం, సాహెబ్‌నగర్ కలాన్ సర్వే నంబర్ 132, 133, ప్లాట్ నంబర్ 123/ఏలోని 650 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము అనేకసార్లు ఆదేశించినప్పటికీ హైడ్రా తీరులో మార్పు లేకపోవడంపై మండిపడింది. కోర్టు విచారణ పెండింగ్ ఉన్న కేసుల్లో ఎలా జోక్యం చేసుకుంటారని నిలదీసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ హైడ్రానే రక్షించడం లేదని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించింది.
గతంలో పలు పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ విషయాల గురించి హెచ్చరించినప్పటికీ మార్పు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. హైడ్రాలో నిర్లక్ష్యం కనిపిస్తున్నదని చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొంది. హైడ్రాపై దాఖలైన కేసు విచారణకు వచ్చిన ప్రతిసారీ హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేస్తేగానీ కదలిక రాదా అని ప్రశ్నించింది. తాజా కేసులో వివరాలు తెలుసుకుని చెప్పాలని హైడ్రాను ఆదేశించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.