హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కోర్ అర్బన్ రీజియన్(సమగ్ర పాలన) బిల్లు 2026కు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇది కేవలం పాత మున్సిపల్ చట్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన బిల్లు మాత్రమేనని, హైదరాబాద్ మహానగర భవిష్యత్ విసృ్తతి, సంక్లిష్టత, అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతమైన పాలనా వ్యవస్థను ఏర్పాటుచేయడమే ప్రధాన ఉద్దేశమని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు 70 ఏండ్లు పూర్తయ్యాయని, అప్పటి పౌర అవసరాలకు అనుగుణంగా రూపొందించారని వివరించారు. ప్రస్తుతం కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మలాజ్‌గిరి కార్పొరేషన్ల ప్రాంతాల జనాభా పన్నెండు రెట్లకు పెరిగి దాదాపు 1.30 కోట్లకు చేరిందని వివరించారు.
దీర్ఘకాలిక ట్రాఫిక్ రద్దీ, సుదీర్ఘ ప్రయాణ సమయాలు, రహదారి ప్రమాదాలు, క్షీణిస్తున్న గాలి నాణ్యత, శబ్దకాలుష్యం, చెరువులు, నాలాలు, సహజ డ్రైన్ల ఆక్రమణలు, మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు, భూగర్భజలాల తగ్గుదల, నీటి కొరత, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార, మహిళల భద్రత, గిగ్ ప్లాట్‌ఫారమ్ కార్మికులు, వీధి వ్యాపారులు తదితర అనేక సమస్యలకు సమగ్రమైన పరిష్కారానికి నూతన వ్యవస్థ అవసరమని తెలిపారు.
నగరవాసులకు మెరుగైన సేవలు అందించాల్సి ఉంటుందని, అందులో భాగంగానే క్యూర్ చట్టాన్ని రూపొందించామని వివరించారు. కాలానుగుణంగా అనవసరమైన అంశాలను తొలగించి, పాత చట్టంలో ఎన్నడూ లేని అవసరమైన కొత్త వ్యవస్థను అందించేందుకు ఒక సమగ్ర పాలనా వ్యవస్థను ఈ బిల్లు ఏర్పాటుచేయనున్నదని వెల్లడించారు. ఇక ఆస్తిపన్నును గరిష్ఠంగా 20శాతం పెంచుతూ బిల్లులో చేసిన ప్రతిపాదనలను 10శాతానికి పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు.
దోమల నివారణకు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఫాగింగ్ చేయిస్తున్నదని, అయితే దోమలకే ఫాగింగ్ నిరోధక శక్తి పెరిగిందని, అవి మాత్రం తగ్గడం లేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అసెంబ్లీలో కోర్ అర్బన్ రీజియన్ (సమగ్ర పాలన) బిల్లుపై చర్చలో సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, పాల్వాయి హరీశ్, శ్రీగణేశ్, నవీన్‌యాదవ్, దానం నాగేందర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నగరంలో దోమల బెడదను ప్రత్యేకంగా లేవనెత్తారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, బయట కూర్చునే పరిస్థితే లేకుండా పోయిందని వివరించారు. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బదులిచ్చారు. నగరంలో దోమల నివారణకు నిరంతరం ఫాగింగ్ చేస్తున్నామని, అయితే దోమలకు ఫాగింగ్ను తట్టుకునే నిరోధకత పెరిగినట్టుందని తెలిపారు.
రాష్ట్రంలో వ్యాపార సమర్థతను పెం చడం, సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తెలంగాణ ప్రజా విశ్వాస చట్టం(జన విశ్వాస్) బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, ఈ బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు ఈ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ చట్టంతో 180 నేరాలకు శిక్షలకు బదులు.. ద్రవ్యపరమైన జరిమానాలు విధిస్తామని చెప్పారు. వివిధ వ్యాపార చట్టాల్లోని చిన్న చిన్న ఉల్లంఘనలను నేర పూరిత పరిధి నుంచి తొలగించేందుకు ఈ బిల్లులను తీసుకొచ్చినట్టు తెలిపారు. చిన్నపాటి తప్పులకు జైలు శిక్ష, న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని చెప్పారు. అనవసర కేసులు, రెడ్‌టేపిజానికి స్వస్తి పలుకుతూ పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
హైదరాబాద్ మహానగరానికి డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలన్నదే రాష్ట్రప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌కు రాబోయే 20, 30 ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగర పాలనను మార్చాల్సి ఉన్నదని పేర్కొన్నారు. శనివారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా నగర పాలనను తీర్చిదిద్దాలని చెప్పారు. క్యూర్ యాక్ట్- 2026 ప్రధాన ఉద్దేశం ఇదేనని స్పష్టంచేశారు. 400 ఏండ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదిగిందని గుర్తుచేశారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్‌సైన్సెస్, డాటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని పేరొన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం రూపొందించి ప్రజల ముందు ఉంచిందని తెలిపారు. 2034 నాటికి తెలంగాణను ఓ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఆర్థికవ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ లక్ష్యాలను సాధించాలంటే హైదరాబాద్ మరింత ఆధునాతనంగా అంతర్జాతీయ స్యికి చేరాలని పేర్కొన్నారు.
క్యూర్ ప్రాంతం రాష్ట్ర విస్తీర్ణంలో చిన్నదైనా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో దాని పాత్ర పెద్దదని తెలిపారు. 2025-26లో తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ సుమారు రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే కేవలం సిటీ డెవలప్మెంట్ కాదని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఓ ప్రధాన గ్రోత్ ఇంజిన్ అని అభివర్ణించారు. అందుకే క్యూర్ ప్రాంతంలోని పరిపాలనా వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. హైదరాబాద్ విస్తరణను దృష్టిలో పెట్టుకుని ఓఆర్ఆర్ పరిధిలో నిర్ణయాలు అమలుచేసేందుకు ప్రత్యేక కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నామని శ్రీధర్‌బాబు ప్రకటించారు.