హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ) : 22ఏ నిషేధిత జాబితా భూములకు సంబంధించిన అంశంపై నిలదీసిన బీజేపీపై కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడికి దిగారు. ఆరోపణలకు జవాబివ్వకుండా చర్చను పక్కదోవ పట్టించేందుకు శతవిధాలా యత్నించారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడిన అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. నిషేధిత జాబితా మాటున ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణాలకు, క్విడ్కోప్రోకు పాల్పడుతున్నదని నిప్పులు చెరిగారు. అనేక మంది బడాబాబుల భూములు, నిర్మాణాలు నిషేధిత జాబితాలో లేవని ఆధారాలతో సహా సభలో నివేదించారు. నిర్మల్ జిల్లాలో సామాన్యులకు చెందిన 700 ఎకరాలకు జాబితాలో పెట్టారని ధ్వజమెత్తారు. నిషేధిత భూముల అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీని మరింత బలోపేతం చేసి, పాడి రైతులకు అండగా నిలిచేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శనివారం శాసనమండలిలో బీఆర్ఎస్ శాసనమండలి ఉపనేత ఎల్ రమణ రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా పాల సేకరణ జరుగటం లేదంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన వాకిటి.. విజయ డెయిరీ పాల సేకరణలో తాతాలికంగా స్వల్ప తగ్గుదల నమోదైందని తెలిపారు. పాడి రైతుల సంక్షేమం, విజయడైయిరీ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కళాకారులను, వారి సేవలను ఉద్యమంలో ఉపయోగించుకున్నారని.. ఆ తర్వాత వారిని మర్చిపోయారని ఎమ్మెల్సీ విజయశాంతి మండిపడ్డారు. శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం కళాకారులకు ఉపాధి కల్పించి, న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఏడాది క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లానని తెలిపింది. ఈ విషయం.. గుర్తుందా? అని సదరు మంత్రిని, విజయశాంతి ప్రశ్నించారు.
కోర్ అర్బన్ రీజియన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు కోర్టులో నిలబడబోదని తేల్చిచెప్పారు. హైడ్రాకు అపరిమిత అధికారాలను కట్టబెట్టడమేందని, ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తారా? అని విమర్శించారు.

కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) చట్టంతో ఆస్తి పన్ను 20శాతం పెరుగనున్నదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయమని, ప్రజలపై భారం వేస్తే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆస్తి పన్ను పెంపుపై సర్కార్ పునరాలోచించాలని కోరారు. స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు ఆస్తి పన్నును 10శాతానికి తగ్గించినట్టు సభలో ప్రకటించారు.
క్యూర్ పరిధిలోని పబ్లిక్ ప్రాంతాల్లో మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు నిర్మించాలని కోదాడ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి అసెంబ్లీలో కోరారు. షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల్లోని పబ్లిక్ టాయిలెట్లు నిర్మించి వాడుకునే సౌకర్యం కల్పించాలని, వ్యర్థాలను తొలగించేందుకు ప్రతి అర కిలోమీటర్‌కు డిస్పోజల్ పాయింట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
గ్రేటర్ పరిధిలో సమన్వయ లోపం సమస్యగా మారిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. హెచ్ఎండీఏ అన్ని అనుమతులిస్తే, ఆ తర్వాత హైడ్రా కూలగొడుతున్నదని, ఇదేం పద్ధతి అంటూ నిలదీశారు. అభివృద్ధి పనులకు నిధులు ఖర్చవుతున్నాయి, కానీ పనులు పూర్తికావడం లేదని పేర్కొన్నారు.
భాగ్యనగరంలో నాలాలు, ఫుట్‌పాత్‌లు కబ్జాకు గురవుతున్నా అధికారులకు పట్టింపులేదని గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టానికి సీఎం రాజు అయితే.. నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాజు అని, వారి లేఖలకు అధికారులు స్పందించకపోవడంపై ఫైర్ అయ్యారు. మూసీ, ఉస్మానియా పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు.
ఫారెస్ట్ సిబ్బందికి తుపాకులు ఇవ్వాలనుకోవడం ప్రమాదకరమని సీపీఐ ఫ్లోర్‌లీడర్ కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తంచేశారు. ఇది ద్వంద్వ పాలనకు దారితీయనున్నదని సర్కార్‌ను హెచ్చరించారు. జన విశ్వాస్ బిల్లుపై మాట్లాడిన ఆయన తుపాకులిచ్చే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో క్రీడా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం శాసనమండలిలో ‘క్రీడా రంగం’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హర్యానాలో అమలవుతున్న క్రీడా విధానాలను అధ్యయం చేసి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మెరుగైన స్పోర్ట్స్ మోడల్‌ను రూపొందించాలని సూచించారు.