సిటీ బ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో అభివృద్ధి పేరిట రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. మొన్నటివరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం పేరిట ప్రజలను ఆందోళనకు గురిచేసిన సరారు, ఇప్పుడు సికింద్రాబాద్లో కీలకమైన ఆర్పీ రోడ్ (రాష్ట్రపతి రోడ్డు) విస్తరణ నెపంతో వందలాది మంది జీవనోపాధిని దెబ్బతీసేందుకు సిద్ధమైంది. సేకరిస్తున్న భూములకు సంబంధించి ముందస్తుగా ప్రజాభిప్రాయ సేకరణ గానీ, నిర్వాసితులకు స్పష్టమైన పునరావాస ప్రణాళిక గానీ ప్రకటించకుండా అడ్డగోలుగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై స్థానికులు, వర్తకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ, జీహెచ్ఎంసీల సమన్వయంతో చేపట్టనున్న ఈ రోడ్డు విస్తరణ నోటిఫికేషన్ ప్రధాన వ్యాపార, రవాణా కేంద్రాలను నేరుగా ప్రభావితం చేస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్లోని రైతిఫైల్ బస్టాండ్ గణేశ్ టెంపుల్ పరిసరాల నుంచి మొదలయ్యే ఈ ప్రాజెక్టు రద్దీ జంక్షన్ల మీదుగా వెళ్లే భూసేకరణ సర్వేలు స్థానిక దుకాణదారుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్- ఆల్ఫాహోటల్ కారిడార్ నిత్యం వేలాది మంది ప్రయాణికులు, వ్యాపార లావాదేవీలతో కళకళలాడే ఈ ప్రాంతం విస్తరణ వల్ల బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక మోండా మారెట్-బాటా షోరూమ్ పరిసరాలు కూడా శతాబ్దాల చరిత్ర కలిగిన మోండా మారెట్ వ్యాపారులు, చిన్న తరహా దుకాణాదారులు ఈ నిర్ణయంతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.
ఆర్పీ రోడ్డులోని ఓల్డ్ సిటీ కంటోన్మెంట్ను కలిపే ప్రధాన రవాణాగా ఈ ప్రాంతంలో చేపట్టనున్న భూసేకరణతో ఆర్పీ రోడ్డులో భూసేకరణ వల్ల కొన్ని వందల ఏండ్లనాటి వ్యాపార సముదాయాలు నిర్వీర్యం కానున్నాయి. జేఏసీగా ఏర్పడిన బాధితులు ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను నిరసిస్తూ సికింద్రాబాద్- ఆర్పీ రోడ్డు బాధితులందరూ ఏకమై సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ భూబాధితుల జేఏసీగా ఏర్పడ్డారు. ప్రాజెక్టుల వల్ల ఎందరు నిరాశ్రయులవుతారు? ఎందరు వ్యాపారులు ఉపాధి కోల్పోతారు? అనే కనీస సామాజిక ప్రభావ అంచనా లేకుండా నోటిఫికేషన్లు ఎలా ఇస్తారని జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. భూసేకరణ చట్టాలను పకనబెట్టి, సరైన నష్టపరిహారం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ఆస్తులను స్వాధీనం చేసుకుంటే చట్టపరంగా, ఉద్యమరీత్యా పోరాడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, మారుతున్న పన్నుల విధానాలతో నష్టాల్లో ఉన్న చిన్న, మధ్య తరహా వ్యాపారులు ఈ విస్తరణ నిర్ణయంతో పూర్తిగా కోలుకోలేని దెబ్బతింటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ నివారణ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న హెచ్ఎండీఏ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో ప్రజల ఆస్తులకు, ఉపాధికి భద్రత లేకుండా చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, బాధ్యతాయుతమైన అధికారులు వెంటనే స్పందించి విస్తరణ ప్లాన్లో మార్పులు చేయాలని, లేదా నిర్వాసితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు పనులు నిలిపివేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.రాబోయే రోజుల్లో ఈ భూసేకరణ వివాదం కాంగ్రెస్ ప్రభుత్వానికి నగర పరిధిలో పెద్ద రాజకీయ, సామాజిక సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.