న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: భారతీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. యూఏఈలో ఉద్యోగం కోసం చూస్తున్న భారతీయులు దేశంలో హోస్ట్ లేదా స్పాన్సర్ అవసరం లేకుండానే విజిట్ వీసాపై దేశంలోకి ప్రవేశించవచ్చని యూఏఈ అధికారిక పోర్టల్ పేర్కొంది. విదేశీయులు ఉద్యో గ అవకాశాలను అన్వేషించడానికి ప్రత్యేకంగా యూఏఈకి వెళ్లేందుకు ఈ వీసా వీలు కల్పిస్తుంది.
దరఖాస్తుదారులు ఒకే ప్రయాణం(సింగిల్ ట్రిప్) కోసం 60, 90 లేదా 120 రోజుల చెల్లుబాటు కాలాన్ని ఎంచుకోవచ్చు. అంటే అర్హులైన భారతీయ ఉద్యోగార్థులు ముందుగా ఉద్యోగ ఆఫర్ను పొందాల్సిన అవసరం లేకుండానే యూఏఈకి వెళ్లి ఉద్యోగాన్ని వెదుక్కోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు నిర్దిష్టమైన విద్య, వృత్తిపరమైన స్థాయి, ఆర్థికపరమైన అర్హతలను కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.
ఉద్యోగాన్వేషణ వీసా ప్రతి దరఖాస్తుదారునికి అందుబాటులో ఉండదు. దరఖాస్తుదారుడు రెండు వృత్తిపరమైన విద్యాపరమైన షరతులలో ఒకదానిని తప్పనిసరిగా నెరవేర్చాలని యూఏఈ చెబుతున్నది. మొదటి వర్గం మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలోని వృత్తిపరమైన వర్గీకరణ ప్రకారం మొదటి, రెండవ లేదా మూడవ నైపుణ్య స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు చెందినది.
విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించిన వర్గీకరణ ప్రకారం ప్రపంచంలోని టాప్ 500 విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన వారు, మునుపటి సంవత్సరంలో ఉత్తీర్ణులైనట్లయితే రెండవ వర్గం వారికి వర్తిస్తుంది.అదనంగా దరఖాస్తుదారులు బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. నిర్దేశించిన ఆర్థిక హామీ నిబంధనను పూర్తి చేయాలి. ఉపాధి అన్వేషణ కోసం ఈ వీసాను ఉపయోగించాలని భావించే భారతీయులు దీనికి యూఏఈ స్సాన్సర్ లేదా ఉద్యోగ ఆఫర్ అవసరం లేనప్పటికీ అర్హతా ప్రమాణాలను పూర్తి చేయడం మాత్రం తప్పనిసరి.