హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): అల్లుడు చేయిస్తున్న మానసిక వైద్యచికిత్స వల్ల తమ కుమార్తె (8 నెలల గర్భిణి) ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉన్నదంటూ గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. వారి కుమార్తెకు, రెండేండ్ల వయసున్న ఆమె కుమారుడికి హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో వైద్యం జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆమె గర్భంలో ఉన్న పిండం ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రక్తహీనత, నరాల సమస్యతో బాధపడుతున్న ఆ తల్లీ బిడ్డలను చూసేందుకు మాత్రమే అనుమతించాలని, ఇతరులెవరినీ అనుమతించరాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖకు ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ టీ వినోద్ కుమార్.. బుధవారం తదుపరి విచారణ కొనసాగిస్తామని ప్రకటించారు.