Bhainsa| హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా భైంసాలో ఈ నెల 19న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించ తలపెట్టిన ‘రూట్ మార్చ్’కు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు.
ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరిస్తున్నట్టు ఇప్పటివరకు పోలీసులు లిఖితపూర్వకంగా స్పష్టం చేయలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది సామల రవీందర్ హైకోర్టుకు తెలిపారు. భైంసా సున్నితమైన ప్రాంతమైనందున గతంలో అక్కడ బీజేపీ సభ నిర్వహణకు కూడా ఇదే కోర్టు అనుమతి నిరాకరించిందని గుర్తుచేశారు. 19న భైంసాలో ముస్లింలు షబ్-ఇ-బరాత్ ర్యాలీ నిర్వహించనున్నారని, అదే సమయంలో ఆర్ఎస్ఎస్ కూడా ర్యాలీ నిర్వహిస్తే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నదని వివరించారు. దీంతో భైంసాలోనే ర్యాలీ నిర్వహించాలని ఎందుకు భావిస్తున్నారని పిటిషనర్‌ను హైకోర్టు నిలదీసింది. ర్యాలీ మార్గాన్ని మార్చుకునేందుకు వీల్లేదా అని ప్రశ్నించింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ నెల 20న లేదా మరో తేదీన ర్యాలీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇస్తారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.