ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఒక ధీమా. వారి ఉన్నత విద్యాభ్యాసం ఫీజులు ప్రభుత్వం చెల్లిస్తుందన్న భరోసా. ఈ పథకం ఆసరాతో రాష్ట్రం నుంచి లక్షలాది మంది బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఏటా డిగ్రీలు పొందుతున్నారు. ఇంతటి కీలకమైన పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసింది. ఫీజు బకాయిలు చెల్లించకుండా పథకం ప్రకారం ఈ స్కీమ్‌కు ఉరి బిగిస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు యావత్తు విద్యావ్యవస్థను కుదిపేసింది. ఈ ఒక్క తీర్పుతో వేలాది మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులకు ఆశాదీపంగా మారిన ఈ పథకం ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంత జరుగుతున్నా సర్కార్ నుంచి స్పందన కరువైం ది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తామనే భరోసా కరువైంది. మరోవైపు ఏటేటా బకాయిలు పెరుగుతూ కొండలా పేరుకుపోయాయి. ‘సర్కార్ వద్ద దమ్మిడి లేదు. రూపాయి అప్పు పుడుతలేదు’ అని ప్రభుత్వం చెప్తున్నది.
మరోవైపు కోట్లకు కోట్లు దుబారా చేస్తున్నది. ఢిల్లీ పర్యటనలు, ప్రత్యేక విమానాల్లో చక్కర్లు, ఆటోల కంటే అధ్వానంగా హెలికాప్టర్ల వాడకాలు మహారాష్ట్ర, కేరళ సహా ఇతర రాష్ర్టాల ఎన్నికలకు అడ్వైర్టెజ్మెంట్లు, అందాల పోటీల పేరిట వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. దుబారాగా ఖర్చు చేసిన ఈ మొత్తం నిధులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి చెల్లించినా సగం బకాయిలు తీరేవని విద్యార్థి సంఘాల నేతలంటున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీలు, విద్యాసంస్థలు డీమ్డ్ బాటపడుతున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలుగా అవతరిస్తున్నాయి. డీమ్డ్ విశ్వవిద్యాలయాలుగా మారేందుకు పలు విద్యాసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. సర్కార్ కూడా ఎడాపెడా ఎన్వోసీలు జారీచేస్తూ, డీమ్డ్కు డోర్లు తెరుస్తున్నది. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర భుత్వం డీమ్డ్ వర్సిటీలకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 12 ప్రైవేట్ వర్సిటీలు, ఐదు డీమ్డ్ వర్సిటీలు ఉన్నాయి. కొత్త గా మరో 15 నుంచి 20 కాలేజీల వరకు డీమ్డ్ హోదా పొందే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే నారాయణమ్మ, కేశవ్ మెమోరియల్, గోకరాజు, వాగ్దేవి కాలేజీలకు డీమ్డ్ హోదా రావడం లాంఛనమే.
గీతాంజలి, వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి, ఏఎస్, కిట్స్ వంటి విద్యాసంస్థలు ఇదే బాటలో ప్రయత్నిస్తున్నాయి. సదరు విద్యాసంస్థలకు వందల కోట్లకుపైగా ఫీజు బకాయిలున్నాయి. ఈ మూడేండ్లలో సర్కార్ రూపాయి విడుదల చేయలేదు. దీంతో డీమ్డ్ వర్సిటీలుగా మారిపోతున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారితే ఫీజులు, రీయింబర్స్మెంట్ బకాయిల బాధ ఉండదు. ఎంతవరకైనా ఫీజుల రూపంలో వసూలు చేసుకోవచ్చు. ఏటా జేఎన్టీయూ, ఓయూ వంటి వర్సిటీల తనిఖీలు అసలే ఉండవు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సును ప్రవేశపెట్టుకోవచ్చు. పైగా ఎంతంటే అంత ఫీజులను ఖరారు చేసుకోవచ్చు.
డీమ్డ్ వర్సిటీలతో విద్యార్థులకు రెండురకాల నష్టం జరుగుతున్నది. ప్రస్తుతం ఉన్న కాలేజీలు, విద్యాసంస్థలు డీమ్డ్కు మారడంతో ఆయా కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కోత పడుతున్నది. ఆయా సీట్లకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. అంటే సర్కార్‌కు ఫీజుల భారం తప్పినట్టే. అందుకే సర్కార్ ఎడాపెడా ఎన్వోసీలు జారీచేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీటెక్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న సీఎస్ఈ కోర్సును మాత్రమే వేలాది సీట్లతో నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు ఏడాదికి సుమారు రూ.2 లక్షల నుంచి 2.50 లక్షల వెచ్చించి చేరుతున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే సర్కార్ ప్రయత్నాలను విద్యార్థి సంఘాలు తప్పుబడుతున్నా యి. సర్కార్‌పై మరో పోరుకు సిద్ధమవుతున్నాయి. వివిధ రూపాల్లో ఉద్యమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని కాంగ్రెస్‌కు బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు ఓటు వేయొద్దని భారీ క్యాంపెయిన్ నిర్వహించబోతున్నట్టు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి తెలిపారు. త్వరలో ‘చలో హైదరాబాద్’ నిర్వహించి, సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 10 రోజుల తర్వాత పాదయాత్ర నిర్వహించనున్నట్టు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఏప్రిల్ 30 తర్వాత కోర్టు తీర్పును బట్టి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. ఈ నెలలోనే భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ప్రకటించారు.