హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. దానంపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవా లు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్ తరఫున సికింద్రాబా ద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, వివేక్‌రెడ్డి హైకోర్టుకు తెలియజేస్తూ.. పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే వేరే ఆధారాలు అవసరం లేదని స్పష్టంచేశారు.
దానం ఒక పార్టీ బీ-ఫారంతో ఎమ్మెల్యేగా గెలిచి, మరో పార్టీ బీ-ఫారంతో ఎన్నికల్లో పోటీ చేయడాన్ని స్వచ్ఛందంగా బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నట్టు పరిగణించాలని కోరారు. దీంతో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా దానంపై అనర్హత వేటు వేయాలని కోరడం సమంజసం కాదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. దానం బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకోలేదని, ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తెలిపారు. ఇతర పార్టీల నేతలను కలువడాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణించరాదని, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై రాజ్యాంగంలో ఎలాంటి నిషేధం లేదని పేరొన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును సెప్టెంబర్ 16కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.