కామారెడ్డి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమిస్తూ జారీచేసిన జీవో అమలును యథాతథంగా కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 19న జారీచేసిన జీవో 597ను సవాల్ చేస్తూ కామారెడ్డి జిల్లా, రాజంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాజా మాజీ అధ్యక్షుడు నల్లవెల్లి అశోక్ మరో 11 మంది డైరెక్టర్లు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టీ మాధవీదేవి మంగళవారం విచారణ జరిపి యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యవసాయశాఖ జారీచేసిన జీవోకు చట్టబద్ధత లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కే బుచ్చిబాబు వాదించారు. చట్టంలోని 115డీ సెక్షన్ ప్రకారం పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారులను నియమించేందుకు వీల్లేదని చెప్పారు. ప్రత్యేకాధికారులను నియమించడం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
వాదనల అనంతరం హైకోర్టు.. ప్రతివాదులైన వ్యవసాయ, సహకారశాఖ కార్యదర్శి, కమిషనర్, కామారెడ్డి జిల్లా సహకారశాఖ డిప్యూటీ రిజిస్ట్రార్, రాజంపేట్ పీఏసీఎస్ కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.