హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కాంపిటీటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని మెడికల్, డెంటల్ కోర్సు సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని హైకోర్టు కాళోజీ వర్సిటీని ఆదేశించింది. కన్వీనర్ కోటా సీట్లు మొత్తం తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 72ను కేవ లం ఆరుగురు విద్యార్థులే సవాల్ చేశారని, ఈ ఆరుగురి కోసం మొత్తం సీట్ల భర్తీని నిలిపివేయడం సరికాదని స్పష్టంచేసింది. దీంతో కన్వీనర్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థుల భర్తీకి ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మెడికల్, డెంటల్ సీట్ల భర్తీకి సంబంధించి నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జూలై 3న జారీచేసిన జీవో 72ను సవాల్ చేస్తూ ఏపీకి చెందిన ఆరుగురు విద్యార్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. రాష్ట్రంలోని 54 వైద్య కళాశాలల్లో తొలి దశ కౌన్సెలింగ్‌కు చెందిన సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేయాలని కాళోజీ వర్సిటీని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర విభజనకు ముందున్న 20 మెడికల్ కాలేజీల్లో పిటిషనర్లు ఆరుగురికీ సీట్లు లభిస్తే సమస్యే లేదని, ఒకవేళ రాకపోతే మిగిలిన 34 కాలేజీల్లో పిటిషనర్ల పరిస్థితి ఏమిటో వివరించాలని వర్సిటీని ఆదేశించింది.
స్థానిక రిజర్వేషన్లు రాష్ట్రం హక్కు
రాష్ట్ర ప్రభుత్వ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. కన్వీనర్ కోటా సీట్లను రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభు త్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్, కాళోజీ వర్సిటీ తరఫున న్యాయవాది ప్రభాకర్‌రావు వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర విభజన నాటికి ఉన్న కాలేజీలకు మాత్రమే వర్తించాల్సిన నిబంధన.. తెలంగాణ ఏర్పాటుచేసిన కాలేజీలకు కూడా అమలు చేయాలని పిటిషనర్లు కోరడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. అధికరణం 371(డీ) కింద స్థానిక రిజర్వేషన్లు పొందే హకు రాష్ట్రానికే ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజ న చట్టానికి విరుద్ధంగా జీవో 72 లేదని తెలిపారు.
రాజ్యాంగానికి లోబడే జీవో వెలువడిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి ఉన్న 20 మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలోని సీట్లను తెలంగాణ, ఏపీ విద్యార్థులకు సమానంగా కేటాయిస్తున్నామని తెలిపారు. విభజన అనంతరం ఏర్పాటైన 34 కాలేజీల్లోని 5,365 సీట్లకు 15 శాతం ఆలిండియా కోటా కింద రిజర్వేషన్ ఉంటుందని, ఈ కోటాలోనే ఏపీ విద్యార్థులు సీట్లు పొందవచ్చునని, మిగిలిన 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకేనని చెప్పారు. తెలంగాణ మాదిరిగానే ఏపీ కూడా ఇదే తరహా జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, తొలుత రాష్ట్ర విభజన నాటికి ఉన్న 20 మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు పూర్తిచేయాలని, ఆ తర్వాత కొత్తగా ఏర్పాటుచేసిన 34 కాలేజీల్లో సీట్ల కేటాయింపులు నిర్వహించి వాటి వివరాలను సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ, ఈ విధంగా చేయాలంటే కంప్యూటర్ కోడింగ్‌లో మార్పు చేయాల్సివుంటుందని, 54 కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో హైకో ర్టు, మొత్తం 54 కాలేజీల్లో సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడించాలని కాళోజీ వర్సిటీకి ఆదేశాలు జారీచేసింది.విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.