హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కొన్ని గ్రామాల్లో ఆయా సామాజికవర్గాల వారు లేనప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. గ్రామాల్లో లేని కులాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పుపట్టింది. గ్రామంలో కేవలం పదిమంది కన్నా తక్కువ ఉన్న వర్గాలకు నాలుగైదు పదవులను ఎలా రిజర్వ్ చేస్తారని ప్రశ్నించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ పీ మాధవీదేవి మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కొన్ని గ్రామాల్లో ఎస్టీలు లేకపోయినా ప్రభుత్వం వారికే సర్పంచ్ స్థానంతోపాటు వార్డు మెంబర్ స్థానాలను రిజర్వు చేసిందని తెలిపారు.
ఒక వర్గానికి చెందినవారు కేవలం ఆరుగురు ఓటర్లు ఉంటే వారికి సర్పంచ్ స్థానంతోపాటు రెండు వార్డులు, 8 మంది ఓటర్లున్నా సర్పంచ్ స్థానాన్ని రిజర్వు చేశారని చెప్పారు. అందువల్ల రిజర్వేషన్లు సవరించి తాజా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న సింగిల్‌బెంచ్ ధర్మాసనం రిజర్వేషన్ల తీరుపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. తాము ఎలాంటి ఆదేశాలిచ్చినా దాని పరిణామాలు తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని డివిజన్ బెంచ్‌కు నివేదించాలని ఉత్తర్వులను జారీ చేశారు. ఈ పిటిషన్లలో పేరొన్న పంచాయతీలను ఇతరులకు రిజర్వు చేయాలంటూ ఉత్తర్వులు జారీచేస్తే అవి రోస్టర్ ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతోపాటు విస్తృత పరిణామాలకు దారి తీస్తాయని, ఖజానాకు నష్టం ఏర్పడినా దానివల్ల ప్రయోజనమూ ఉండదని అన్నారు. అందువల్ల ఈ పంచాయతీ ఎన్నికలపై డివిజన్ బెంచ్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ పిటిషన్లను బుధవారం డివిజన్ బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.
సామాజిక న్యాయంతోపాటు చారిత్రకంగా అణగారినవర్గాలకు రాజకీయ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించిందని న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణం 243-డీ, 243-టీ ప్రకారం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు అందించాల్సి ఉందని చెప్పారు. గ్రామ స్వయం పాలన నిమిత్తం ఏర్పాటయ్యే కార్యనిర్వాహక సంస్థ పంచాయతీ అని, ఇది స్థానిక సౌకర్యాల కల్పన, అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుకు జవాబుదారీగా ఉండేలా పంచాయతీ ప్రతినిధులను ప్రజలు నేరుగా ఎన్నుకోవడం ద్వారా స్వయం పాలన వ్యవస్థ ఏర్పాటవుతుందని వివరించారు. పలు రాష్ట్రాలు ఎస్టీ, ఎస్సీ బీసీ, మహిళలకు పాలనలో ప్రాతినిధ్యం, భాగస్వామ్యం కల్పించడానికి వీలుగా రిజర్వేషన్ల కల్పనకు చట్టాలున్నాయని తెలిపారు. అయితే సంబంధిత వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోతే ఈ సూత్రాలు వీగిపోతాయని వ్యాఖ్యానించారు.
అంతకుముందు పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి పంచాయతీలో ఎస్టీ ఓటరు ఒకరూ లేరని అయినా సర్పంచ్‌తోపాటు మూడు వార్డు మెంబరు స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేశారని చెప్పారు. సంగెం మండలం ఆశలపల్లి గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం సర్పంచ్ స్థానంతోపాటు రెండు వార్డు మెంబరు స్థానాలను ఎస్సీలకు రిజర్వు చేశారని తెలిపారు. నల్లగొండ జిల్లా అనుముల మండలం శివాలయం పేరూరు గ్రామంలో ఎస్టీలే లేరని, అయినా సర్పంచ్ తోపాటు 4 వార్డు మెంబర్లను ఎస్టీలకు కేటాయించారని చెప్పారు.
అదే జిల్లాలోని కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో కేవలం ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉంటే ఒక సర్పంచ్, రెండు వార్డు స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేశారని, సర్పంచ్ పోస్టును ఎస్టీ మహిళకు కేటాయించారని వివరించారు. దీనిపై 2024లోనే వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తకలపల్లి గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వు చేశారని, కానీ ఈ గ్రామంలో ఎస్టీలు కేవలం 13 మంది ఉండగా అందులో ఓటర్లు 8 మంది మాత్రమేనని తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ మండలం, భట్పల్లి జీపీ సర్పంచ్, 6 వార్డు మెంబరు స్థానాలను ఎస్టీలకు 2011 జనాభా లెకల ప్రకారం రిజర్వు చేశారని పేర్కొన్నారు.