హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): కోర్టులను అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణాలకు విద్యుత్తు కనెక్షన్లు పొందడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఎస్పీడీసీఎల్ విద్యుత్తు కనెక్షన్ నిరాకరిస్తే నిర్మాణదారులు కోర్టును ఆశ్రయించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తామన్న హామీతో ఉత్తర్వులు పొందుతున్నారని, తీరా కనెక్షన్ పొందాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించడం లేదని ఆక్షేపించింది. దీనిపై అధికారులు నిర్మాణాలను తనిఖీ చేయడం లేదని తప్పుపపట్టింది.
దీంతో ఆ అక్రమ నిర్మాణాలను బిల్డర్లు ఇతరులకు అమ్మేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తామనే హామీతో సుమారు 1,500 పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయని పేర్కొన్నారు. ఐదంతస్తుల భవనానికి విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ నాంపల్లికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ రిజ్వాన్ హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల విచారణ జరిపారు.