High Court | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో హడావుడిగా ఎందుకు కూల్చివేత చర్యలు చేపడుతున్నారని, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. ‘ఈ రోజు నోటీసు ఇచ్చి రేపు కూల్చేస్తారా? ఒక రోజు కూడా ఆగలేకపోతున్నారా? శనివారం నోటీసు ఇచ్చి ఆదివారం కూల్చేస్తారా? ఆ తర్వాత కోర్టు పనిదినం వచ్చే వరకైనా ఆగలేరా? ఆగమేఘాల మీద కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బాధితులకు గడువు ఎందుకు ఇవ్వడం లేదు? ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఏమిటి?’ అని నిప్పులు చెరుగుతూ పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. హైడ్రా కేవలం నోడల్ ఏజన్సీ మాత్రమేనని పేర్కొంటూ.. దానికి ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలని నిలదీసింది. దీనిపై గతంలోనే వివరణ కోరామని, ఇప్పుడు మళ్లీ కోరుతున్నామని స్పష్టం చేసింది. తమ ప్రశ్నలపై వివరణ ఇచ్చేందుకు హైడ్రా కమిషనర్‌తోపాటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల తాసిల్దార్ వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్లో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ.. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అమీన్పూర్ సర్వే నంబర్ 164లోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను 48 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20న తాసిల్దార్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ డాక్టర్ మహమ్మద్ రఫీ, గణేశ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిలోని శ్రీకృష్ణనగర్‌లో రఫీ, గణేశ్ కన్స్ట్రక్షన్ సంస్థకు సంబంధించిన ఆస్పత్రి భవనానికి సంబంధించి సెప్టెంబర్ 5న జారీచేసిన ఉత్తర్వులను తాసిల్దార్, హైడ్రా కమిషనర్ ఉల్లంఘించారని, కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేత చర్యలు చేపట్టారని తీవ్రంగా తప్పుపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది నరేందర్‌రెడ్డి వాదిస్తూ.. అమీన్పూర్ తాసిల్దార్ ఈ నెల 20తో ఉన్న నోటీసులను 21న సాయంత్రం 6.30 గంటలకు అందజేశారని, ఆ మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు జేసీబీలు, బుల్డోజర్లు, 50 మంది సిబ్బందితో హైడ్రా వచ్చి 5 అంతస్తుల దవాఖాన భవనాన్ని కూల్చేసిందని తెలిపారు. 165, 166 సర్వే నంబర్లలో రఫీకి చెందిన 270 గజాల స్థలాన్ని గణేశ్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు విక్రయించడంతో ఆ స్థలంలో నిర్మాణాల కోసం గ్రామ పంచాయతీ నుంచి 2022 నవంబర్ 10న అనుమతులు తీసుకున్నారని వివరించారు. పంచాయతీ నుంచి అనుమతులు ఉన్నందున ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవడం లేదని అప్పట్లో పంచాయతీ తరఫు న్యాయవాది చెప్పడంతో ఆ పిటిషన్‌పై హైకోర్టు విచారణను మూసేసిందని గుర్తు చేశారు. ఇటీవల ఆ స్థలంలో కూల్చివేతలు చేపట్టనున్నట్టు హైడ్రా అధికారులు బెదిరించడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ పిటిషన్‌పై ఇంతకుముందు హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్ ఆస్పత్రి ఉన్న ప్రాంతాన్ని హైడ్రా ఎన్నడూ సందర్శించలేదని, కూల్చివేత చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని చెప్పడంతోపాటు ఏ చర్యలైనా జీవో 99కు అనుగుణంగానే ఉంటాయని హామీ ఇచ్చారని, దీంతో ఆ పిటిషన్‌పై సెప్టెంబరు 5న హైకోర్టు విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించిందని వివరించారు. కాగా, గతంలో పంచాయతీ ఇచ్చిన అనుమతులను ఈ ఏడాది ఫిబ్రవరిలో రద్దు చేయడంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసిందని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిపినట్టు పేర్కొంటూ అమీన్పూర్ తాసిల్దార్ ఈ ఏడాది ఏప్రిల్ 2న నోటీసులు జారీ చేశారని, ఈ నోటీసులకు 15 రోజులు గడువు కావాలని పిటిషనర్లు కోరినప్పటికీ అనుమతించలేదని పేర్కొన్నారు. పిటిషనర్లు 18న వివరణ సమర్పించినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదని, ఈ నెల 20న నిర్మాణాలను తొలగించాలనే నోటీసుల్లో 48 గంటలే గడువు ఇచ్చారని చెప్పారు. ఈ నెల 20వ తేదీతో ఉన్న నోటీసులను 21న సాయంత్రం అందజేశారని, ఆ మరుసటి రోజు ఉదయమే నిర్మాణాలను కూల్చివేశారని తెలిపారు. దీనిపై హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి వాదిస్తూ.. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగింపునకు యంత్రాలను, సిబ్బందిని పంపాలని కోరుతూ అమీన్పూర్ తాసిల్దార్ నుంచి ఈ నెల 21న లేఖ అందిందని, దీంతో జీవో 99 ప్రకారం ప్రభుత్వ స్థలం రక్షణ కోసం యంత్రాలను, సిబ్బందిని పంపామని వివరించారు.
అనంతరం ఇరు పక్షాల వాదనలను, రికార్డులను బేరీజు వేసిన హైకోర్టు.. ఆక్రమణలను తొలగింపునకు తాసిల్దార్ జారీ చేసిన నోటీసుపై పిటిషనర్ స్పందించలేదని గుర్తించింది. అలాగే ఏప్రిల్ 15న పిటిషనర్ గడువు కోరిన విషయాన్ని మాత్రమే తాసిల్దార్ గమనంలోకి తీసుకున్నారని, అందుకే ఏప్రిల్ 18న పిటిషనర్ సమర్పించిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేతలకు ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నది. పిటిషనర్ల వ్యాజ్యంపై విచారణ పూర్తయ్యే వరకూ ఆ నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, అయినప్పటికీ కూల్చివేత చర్యలు చేపట్టడం హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది.