హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): న్యాయశాస్త్ర కోర్సుల ప్రవేశాల్లో జాప్యానికి కారణాలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ కన్వీనర్‌కు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది.
2024- 25 విద్యాసంవత్సరంలో లా డిగ్రీ కోర్సుల అడ్మిషన్లలో జాప్యంపై న్యాయవాది ఏ భాసర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. విద్యాశాఖ తరఫున కౌంటరు దాఖలుకు సమయం కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ కోరారు. విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది.