హైదరాబాద్, నవంబర్ 14, (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువశక్తి పార్టీ అభ్యర్థులకు ఉమ్మడి గుర్తు కేటాయించకపోవడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి గుర్తు కేటాయిం చేందుకు నిరాకరిస్తూ అక్టోబర్ 20న ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను ఆ పార్టీ అధ్యక్షుడు బీ రామ్మోహన్‌రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. 2018 నవంబరు 9న తెలంగాణ యువశక్తి పార్టీ రిజిస్టర్ అయ్యిందని, రిజిస్టరైన పార్టీకి ఉమ్మడి గుర్తు కేటాయించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయినందున పార్లమెంట్ ఎన్నికల నాటికి గుర్తు కేటాయింపు అంశంపై విచారణ చేస్తామని ప్రకటించింది. ఈసీకి నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.