హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): మూల్యాంకనం నిమిత్తం ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే వారిని ఎంపిక చేసేందుకు అనుసరించిన విధానం ఏమిటో వివరించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు తెలంగాణ చరిత్రకు సంబంధించి మూల్యాంకనం ఎలా చేస్తారో కూడా తెలపాలని కోరింది. కోర్టు అడిగిన వివరాలను సీల్డ్ కవర్లో అందజేస్తామని సర్వీస్ కమిషన్ తరఫు న్యాయవాది చెప్పారు. గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ వరుసగా నాలుగోరోజు గురువారం కూడా కొనసాగింది.
తొలుత టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్ష రాసిన వారి సంఖ్యలో తేడాలు ఉన్నాయనే వాదనలను వ్యతిరేకించారు. మొత్తం అభ్యర్థులు 21,110 మంది కాగా, వారిలో 25 మంది స్పోర్ట్స్ కోటా వాళ్లను మినహాయిస్తే, 21,085 మంది ఉన్నారని తెలిపారు. తెలుగు మీడియం నుంచి 8,694, ఇంగ్లిషు మీడియం వారు 12,381 మంది, ఉర్దూ మీడియం వారు 10 మంది చొప్పున పరీక్ష రాశారని వివరించారు.
మహిళలు అత్యధిక సంఖ్యలో అర్హత సాధించడం వెనుక ఎలాంటి అక్రమాలకు ఆసారమే లేదని పేర్కొన్నారు. ఎంపికైన మొత్తం అభ్యర్థుల్లో కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన మహిళా అభ్యర్థులు 12 శాతం ఉన్నారనే వాదనను తోసిపుచ్చారు. వారి ఎంపిక 5.4 శాతం లోపేనని చెప్పారు. ఈ కేసులో విచారణ శుక్రవారం కూడా కొనసాగనున్నది.