హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): నీట్ అడ్మిషన్లలో క్రీడా కోటా రిజర్వేషన్‌ను ఎందుకు తొలగించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్నది. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్యా కోర్సుల్లో క్రీడా కోటా కింద 0.3 శాతం రిజర్వేషన్‌ను తొలగిస్తూ జూలై 4న జారీ చేసిన జీవో 75 చట్టవిరుద్ధమని పేరొంటూ హైదరాబాద్‌కు చెందిన జీ హరికృష్ణ, ఇతరులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
క్రీడా కోటా రిజర్వేషన్ కింద 2018లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది జైశ్వాల్ వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్ల కల్పన నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందజేసిందని, ఆ నివేదిక ఇవ్వాలని సమాచార హకు చట్ట ప్రకారం అడిగినా ఇవ్వడం లేదని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.