BC Commission | హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఉత్తర్వులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీసీ, ప్రజాసంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం కూడా రిజర్వేషన్ల బీసీ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగించడంపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు కల్పించే రిజర్వేషన్ల శాతం నిర్ణయానికి రాజ్యాంగంలోని 340 అధికరణ మేరకు స్వయంప్రతిపత్తి కలిగిన డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిషనే గ్రామస్థాయి వరకు ఆయా వర్గాల రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి, కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు.
ఈ తీర్పు ప్రకారమే దేశంలోని అన్ని రాష్ర్టాలు వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాలని చాలా స్పష్టంగా నొక్కిచెప్పింది. ఆ తీర్పులను ఉల్లంఘించిన పలు రాష్ర్టాలపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతోపాటు, ఆయా రాష్ర్టాల నిర్ణయాలను కొట్టివేసింది. అందుకు గుజరాత్, ఇటీవల మహారాష్ట్ర కూడా ఒక ఉదాహరణగా నిలుస్తున్నది.
ఇదే విషయాన్ని మొదటి నుంచీ బీసీ సంఘాలు, ప్రతిపక్షపార్టీలు నొక్కిచెబుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒంటెత్తు పోకడతో ముందుకు సాగుతున్నది. రాజ్యాంగం, సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ ప్రక్రియను చేపట్టింది.
ప్రస్తుతమున్న బీసీ కమిషనే డెడికేటెడ్ కమిషన్‌గా వ్యవహరిస్తుందంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వం పెడచెవిన పెడుతుండటంతో ఇటీవల బీసీ సంఘం నేతలు కోర్టును ఆశ్రయించారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారు విషయంలో అభ్యర్థనలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఈ నెల 28 నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి లో పర్యటించగా, శుక్రవారం కరీంనగర్లో బహిరంగ విచారణను పూర్తిచేసింది.
హైకోర్టు తీర్పు ప్రకారం బీసీ కమిషన్ సేకరించే అభిప్రాయ సేకరణ ఎందుకు పనికిరాకుండా పోతుందని, అయినా ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలని బీసీ నేతలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. అదీగాక నేడు (శనివారం) వరంగల్, 4న నల్లగొండ, 5న ఖమ్మం, 7న రంగారెడ్డి, 8న మహబూబ్‌నగర్, 11న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ చేపట్టేందుకు బీసీ కమిషన్ సన్నద్ధమవుతుండటంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.