హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావుపై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ పార్టీ కార్యకర్తలతో కలిసి అమరవీరుల స్థూపం వద్ద డ్రోన్ వినియోగించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ చేపట్టారు. కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని, ఎన్నికల నియామావళిని ఆయన ఉల్లంఘించలేదని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి సెక్షన్ 188 కింద నమోదు చేసిన కేసులో దానికి అనుగుణంగా ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టివేశారు.