హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం నిప్పులకుంపటిలా మారింది. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జనాలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈనెల మొదటివారంలో ఉష్ణోగ్రతలు అంతగా లేకపోయినా మూడోవారంలో మాత్రం గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. పెరిగిన ఎండలకు వడగాలులు తోడుకావడంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్జ్ జారీ చేసినట్టు పేర్కొన్నది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5, పెద్దపల్లి జిల్లా ముత్తారం (మంథని)లో 46.5 డిగ్రీలు నమోదైందని తెలిపింది.
వచ్చే నాలుగైదు రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వివరించింది. పెరిగిన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఎండలో పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకున్నట్టు తెలిపింది. కనిగిరిలో అత్యధికంగా 48.3, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.97, అచ్చంపేటలో 47.71, కృష్ణా జిల్లా నందివాడలో 47.61 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వచ్చే మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి వల్ల పలు ప్రాంతా ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అకడకడ కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
తీవ్రమైన వడగాలులు, ఎండ దెబ్బకు తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో వేర్వేరు జిల్లాల్లో 13 మంది మృతిచెందినట్టు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మృతుల్లో ఉపాధిహామీ కూలీలు, వ్యవసాయ, పారిశుధ్య కార్మికులు ఉన్నట్టు పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కార్మికులు వడదెబ్బకు మృత్యువాతపడుతున్నట్టు ఆందోళన వ్యక్తంచేశారు. ఈనెలాఖరు వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
