హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే ప్రభుత్వం శాసనమండలిలో పలు బిల్లులను ప్రవేశపెట్టింది. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశమైన తర్వాత మున్సిపల్ చట్టసవరణ, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లును మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లులను మంత్రి సీతక్క, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు.
ఆయా బిల్లులపై పూర్తిస్థాయిలో చర్చించకుండానే శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే ఘోష్ కమిషన్ నివేదికను మాత్రం మండలిలో ప్రవేశపెట్టలేదు. కేవలం 50 నిమిషాల వ్యవధిలోనే మున్సిపల్, పంచాయతీరాజ్ సవరణ బిల్లులు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించడం విశేషం.
సోమవారం ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశం ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. కాళేశ్వరంపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ మండలిలో ఆందోళనకు దిగారు. ‘జై తెలంగాణ.. ఘోష్ కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్.. కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరంపై కుట్ర..’ అనే నినాదాలతో హోరెత్తించారు. చైర్మన్ పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అధికార పక్ష సభ్యులు సైతం నినాదాలు చేయడంతో సభలో ఉద్రిక్తత నెలకొన్నది. ఈ గందరగోళం మధ్యే మంత్రులు బిల్లులు ప్రవేశపెట్టగా మండలి ఆమోదం తెలిపింది.