హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏం సాధించిందని తెలంగాణ రైజింగ్ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ‘10 నెలల్లో రూ.35 వేల కోట్ల రాబడి లోటు ఉన్నందుకా? పరిశ్రమల స్థాపనలో విఫలమైందుకా? పెట్టుబడుల సాధనలో వెనుకబడినందుకా? ఉద్యోగాలివ్వడంలో ఫెయిలైనందుకా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణను అన్ని రంగాల్లో పదేండ్లు వెనక్కి తీసుకెళ్లిన రేవంత్ సర్కారు నిర్వహించుకోవాల్సింది రైజింగ్ పండుగ కాదని, రివర్సింగ్ పండుగని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత రాఘవతో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గతేడాది 2,600 పరిశ్రమలు వస్తే రేవంత్‌రెడ్డి వచ్చాక ఈ ఏడాదిలో కేవలం 1,200 మాత్ర మే వచ్చాయని వివరించారు. 2015లో రూ. 28 వేల పెట్టుబడులు సాధిస్తే ఈ ఏడాది కేవలం రూ.8,468 కోట్లేనని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో 18.60 లక్షల ఉద్యోగాలు (సగటున ఏడాదికి 1.80 లక్షలు) వస్తే ఈ ఏడాది ఇచ్చింది 34 వేల ఉద్యోగాలేనని, వాటికీ బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చినవేనని గుర్తుచేశారు. నిర్బంధాలు, కూల్చివేతలు, లైంగికదాడులు, లాఠీచార్జీలు, విద్యార్థుల మరణాలు, జర్నలిస్టులపై కేసులు, రైతులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలలో తెలంగాణ రైజింగ్ అవుతున్నదని దెప్పిపొడిచారు.