హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ‘షాక్’ కొడుతున్నాయి. మొండి బకాయిల రూపంలో సవాల్‌గా మారాయి. సెప్టెంబర్ 30 వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల నుంచి డిస్కంలకు రూ.48,005 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. వీటిలో కరెంట్ చార్జీల రూపేణా రూ.31,763.1 కోట్లు, సర్‌చార్జీల రూపంలో రూ.16,242.2 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఈ మొత్తం బకాయిల్లో సగం (రూ.24 వేల కోట్లు) నీటిపారుదల శాఖ నుంచి రావాల్సినవే.
డిస్కంలకు బకాయిలు చెల్లించాల్సిన ప్రభు త్వ విభాగాల్లో ఇరిగేషన్, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖ, జలమండలి ఉన్నాయి. జలమండలి విద్యుత్తు చార్జీల రూపంలో రూ,5,585.40 కోట్లు, సర్‌చార్జీల రూపంలో రూ.1,846.80 కోట్లు బకాయి పడింది. మిషన్ భగీరథ విద్యుత్తు చార్జీల రూపేణా రూ.4,223 కోట్లు, సర్‌చార్జీల రూపేణా రూ.2.043.03 కోట్లు చెల్లించా ల్సి ఉన్నది.
పంచాయతీరాజ్ శాఖ విద్యుత్తు చార్జీల రూపంలో రూ.2,623 కోట్లు, సర్‌చార్జీల రూపంలో రూ.3,215 కోట్లు బకాయి పడింది. ఈ బిల్లుల చెల్లింపులో సంబంధిత ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో మొండి బకాయిలు పేరుకుపోయి డిస్కంలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆర్థిక లోటుతో అవస్థలు పడుతున్నాయి.
