హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ‘మొత్తం పెండింగ్ బిల్లులను ఒకేసారి ఇవ్వలేం. ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాం’ ఇది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. ఈ నెలలో విడుదల చేయాల్సిన రూ.700 కోట్లింకా విడుదల చేయలేదు. ఇప్పటికే నెల ముగింపునకు చేరుకున్నది. దసరా పండుగ సమీపిస్తున్నది. వరుస సెలవులున్నాయి. ఈ రెండు రోజుల్లో బిల్లులు జారీకావడం కష్టంగానే కనిపిస్తున్నది. ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికలతో గత నెలలో కొన్ని బిల్లులను సర్కారు విడుదల చేసింది. అయితే ఈ నెల బిల్లులపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఆర్థికంగా కుదేలై అవస్థలు పడుతున్న తరుణంలో రాష్ట్ర ఖనాజాపై జీఎస్టీ స్లాబుల మార్పిడీ దెబ్బ పడింది. స్లాబుల మార్పిడీతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. ఈ నేపథ్యంలో ఈనెల పెండింగ్ బిల్లుల విడుదల కష్టమేనని తెలుస్తున్నది.
రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు మొత్తం అక్షరాలా 10 వేల కోట్లకు పైనే ఉన్నాయి. జీపీఎఫ్, సరెండర్, లీవు, నగదు ఎన్క్యాష్మెంట్ లీవు, మెడికల్ రీయింబర్స్మెంట్, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, సంపాదిత సెలవుల బిల్లులు మొత్తం రూ.8 వేల కోట్లు ఉంటే సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించినవి మరో రూ.2 వేల కోట్ల బిల్లుల బకాయి ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. సీపీఎస్ ఉద్యోగులకు వాటాను సైతం సర్కారు చెల్లించడంలేదు. రాష్ట్రంలో 3.6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరందరికీ ఏదో ఒక బిల్లు పెండింగ్లో ఉన్నది. దీంతో ప్రతి ఉద్యోగీ పెండింగ్ బిల్లుల బాధితులేని తెలుస్తున్నది. గతంలో పెండింగ్ బిల్లులను ట్రెజరీలో సమర్పించిన 24 గంటల్లో డబ్బు ఉద్యోగి అకౌంట్లో పడేది. కానీ ఇప్పుడు కండ్లు కాయలు కాసేలా వేచిచూడాల్సి వస్తున్నది.
పెండింగ్ డీఏలను సర్కారు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు పేరడీ పాటలతో నిరసన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఐదు డీఏలను బాకీపడింది. ఇప్పటివరకు రెండు డీఏలు మాత్రమే విడుదల చేసింది. ఈ రెండు డీఏ బకాయిల ను వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 9 వాయిదాల డీఏ చెల్లించలేదు. డీఏ పెండింగ్లో ఉండటం, బకాయిలు విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల బాధలు వర్ణనాతీయంగా మారాయి.