SE Vijay Bhasker Reddy | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్‌శాఖలో ముఖ్యమంత్రి ఆప్తమిత్రుడికి ఏకంగా ఐదు బాధ్యతలు అప్పగించినట్టు చర్చ జరుగుతున్నది. నిబంధనలను తుంగలో తొక్కి నచ్చినవాళ్లకు, నచ్చినచోట రేవంత్ సర్కార్ పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు తాజాగా ఓఅండ్ఎం (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) ఈఎన్సీగా విజయభాస్కర్‌రెడ్డిని నియమించడమే నిదర్శనమని శాఖలోని పలువురు ఇంజినీర్లే చెప్తున్నారు. ఈఎన్సీగానే కాకుండా మరికొన్ని చోట్ల ఆయన ఒక్కడికే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారని, సీనియర్లను కాదని ఎలా నియమిస్తారని మండిపడుతున్నారు.
సాగునీటిపారుదలశాఖ ఓఅండ్ఎం ఈఎన్సీగా విజయభాస్కర్‌రెడ్డిని ప్రభుత్వం ఇటీవల నియమించింది. చీఫ్ ఇంజినీర్ కాని వ్యక్తిని ఏకంగా ఈఎన్సీ పోస్టులో నేరుగా నియమించడమే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. వాస్తవంగా ఆయన నాగర్‌కర్నూల్ సర్కిల్-1 ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజినీర్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ సీఈగా విధులు నిర్వర్తించిన హామీద్‌ఖాన్ గత మేలో విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో ఎస్ఈ విజయభాస్కర్‌రెడ్డికే సీఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత వనపర్తి సీఈ విరమణ పొందగా ఆ బాధ్యతలను కూడా విజయభాస్కర్‌రెడ్డికే అప్పగించారు. తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఎండీగానూ నియమించారు. కాళేశ్వరం కమిషన్‌లో టెక్నికల్ సీఈగానూ ఆయననే నియమించడం గమనార్హం. అసలు చీఫ్ ఇంజినీర్ కాకముందే ఇప్పటికే నాలుగు చోట్ల అదనపు బాధ్యతలను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. సీఈ కాకముందే ఓఅండ్ఎం ఈఎన్సీ స్థానాన్ని ప్రభుత్వం కట్టబెట్టడం కొసమెరుపు.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అనేక మంది సీనియర్ చీఫ్ ఇంజినీర్లు ఈఎన్సీ ప్రమోషన్ల జాబితాలో ఉన్నారు. ఓఅండ్ఎం ఈఎన్సీగా పనిచేసిన నాగేందర్రావు గత నవంబర్‌లో విరమణ పొందారు. ఆయన స్థానంలో సీనియార్టీ జాబితాలో ముందున్న చీఫ్ ఇంజినీర్లు శ్రీనివాస్, అమ్జద్హుస్సేన్ పేర్లను ప్రభుత్వానికి ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ ప్రతిపాదించారు. వారు కాకుండా జోన్ 6లోనూ సీనియర్ చీఫ్ ఇంజినీర్లు మోహన్‌కుమార్, ప్రమీల, అనితతోపాటు ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ ప్రభుత్వం సీనియర్ చీఫ్ ఇంజినీర్లను పక్కనపెట్టి విజయభాస్కర్రెడ్డినే నియమించడం విమర్శలకు దారితీసింది. దీనివెనక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చక్రం తిప్పారని ఇరిగేషన్వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల ఉద్యోగ విమరణ పొందిన వారి స్థానాన్ని ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. లేదంటే ఆ డివిజన్లో సీనియరైన మరొకరికి అదనపు బాధ్యతలు అప్పగించాలి. కానీ, నచ్చినవారికి ఎఫ్ఏసీలుగా బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు. తాజాగా శాఖలో పదుల సంఖ్యలో ఇంజినీర్లకు ఈఈలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.