రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 3 ( నమస్తే తెలంగాణ) : నేతన్నల సమ్మెపై సర్కారు ఉక్కుపాదం మోపింది. కూలీ రేట్లు ప్రభుత్వమే నిర్ణయించాలని చేపట్టిన నిరవధికను సమ్మెను విచ్ఛిన్నం చేసింది. ఆర్డర్లు ఇచ్చిన ఇందిరమ్మ చీరల తయారీకి కూలీ రేట్లు ప్రభుత్వమే నిర్ణయించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మూడ్రోజులుగా మరమగ్గాల కార్మికులు సాంచాలు బంద్‌పెట్టి సమ్మె చేస్తున్నారు. గురువారం బీవైనగర్‌లోని పాత చేనేత జౌళీశాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ నాయకులు, వార్పిన్, వైపనీ అసోసియేషన్ నాయకులు కార్మికులతో సమావేశమయ్యారు. జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ తీయాలని చర్చించుకుంటున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పగా, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని కార్మికులు వివరణ ఇచ్చినా వినిపించుకోలేదు. బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టు విషయం తెలుసుకొని తోటి కార్మికులు పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. కార్మికులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కార్మికులను రిలీజ్ చేశారు.